రఫేల్ అంశంపై కేసీఆర్ ఒక్కసారి కూడా ఎందుకు మాట్లాడలేదని రాహుల్ ప్రశ్నించారు. జీఎస్టీకి, నోట్లరద్దు చేసిన మోదీకి కేసీఆర్ మద్దతిచ్చారని మండిపడ్డారు. కేవలం కాంగ్రెస్ పార్టీయే మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా పోరాడుతోందని తెలిపారు. ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ. 15లక్షల వేస్తామని అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ.. ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. అవినీతి రహిత సమాజం కావాలంటే చౌకీదార్‌ను పక్కనపెట్టాలని సూచించారు.
సర్జికల్ స్ట్రైక్‌కు సిద్ధం
జీఎస్టీ, నోట్ల రద్దు రూపంలో ప్రజల నుంచి డబ్బు దోచుకున్న ప్రధాని.. ఆ సోమ్మును అనీల్ అంబానీ జేబులో వేశారని ఆరోపించారు. అంబానీ ముక్కు పిండి ప్రతి రూపాయి వసూలు చేసి.. ప్రజలకు ఇస్తామన్నారు. పేదరికంపై సర్జికల్ స్ట్రైక్‌కు సిద్ధమన్నారు. పేదల ఖాతాలో ఏడాదికి రూ.72 వేలు జమ చేస్తామని హామీ ఇచ్చారు.
లంచం ఇవ్వకుంటే పని జరగట్లేదు..
ప్రజలు సాధించుకున్న తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబానికి తప్ప ఎవరికీ మేలు జరగలేదని వనపర్తి సభలో రాహుల్ గాంధీ మండిపడ్డారు. అధికారులకు లంచం ఇవ్వనిదే తెలంగాణలో ఏ పనీ జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలు వ్యాపారం చేయడానికి ఎలాంటి అనుమతి అవసరం లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏ రకమైన అనుమతి లేకుండా కుటీర పరిశ్రమలు, చిన్న వ్యాపారాలు నిర్వహించుకోవచ్చని తెలిపారు.
నల్గొండకు హామీలు
జిల్లా వాసులపై రాహుల్ హామీల వర్షం కురిపించారు. నల్గొండ జిల్లా ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ ప్రజలకు శుద్ధమైన నీరు ఇస్తామని ఐదేళ్ల క్రితం కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. నీరందించడానికి ప్రవేశపెట్టిన మిషన్ భగీరధ పథకం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. అధికారంలోకి రాగానే ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.
మహబూబ్ నగర్ బీఎస్పీ నేత ఇబ్రహీం, తెరాస తిరుగుబాటు నేత వీర్లపల్లి శంకర్ సహా పలువురు నేతలు రాహుల్ సమక్షంలో హస్తం పార్టీలో చేరారు.