ఉమ్మడి జిల్లాలో జోగులాంబ గద్వాల జిల్లాలోనే అత్యధికంగా 45 కేసులు నమోదయ్యాయి. వీరిలో 44 మంది కోలుకోగా.. ఒక్కరు మృత్యువాత పడ్డారు. ఈ 45 కేసుల్లో కూడా.. కేవలం గద్వాల పట్టణంలోనే 31 కేసులు బయటపడ్డాయి. పాజిటివ్ లక్షణాలతో గాంధీలో చేరిన వారంతా చికిత్స పొంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మహబూబ్నగర్ జిల్లాలో 11 కేసులు నమోదు కాగా.. అందరూ కోలుకొని ఇంటికి చేరుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో మర్కజ్ నుంచి వచ్చిన ఇద్దరు కరోనా లక్షణాల నుంచి బయటపడి పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. నారాయణపేట జిల్లాలో ఒక్కరు కరోనా నుంచి కోలుకున్నారు. వనపర్తి జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ప్రస్తుతం ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదు.
14 రోజులుగా ఒక్క కేసు లేదు..
ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 9790 మంది హోం క్వారంటైన్లో ఉన్నారు. గత పద్నాలుగు రోజులుగా.. ఉమ్మడి జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. అంతేకాదు.. క్రియాశీలకంగా ఉన్న పాజిటివ్ కేసులు కూడా లేవు. లాక్డౌన్ ఈ నెల 29 వరకు కొనసాగనుండడం, జిల్లాలో కరోనా కేసులు లేకపోవడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని అధికారులు కొంత సడలింపులు ఇచ్చారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి అధికారులు పరీక్షలు నిర్వహించి నేరుగా.. హోం క్వారంటైన్లో ఉంచుతున్నారు. నిబంధనలు పాటించని వారి పట్ల పోలీసులు, అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు.
ఇవీ చూడండి: ఆ అడవి నాదే..ఈ నగరం నాదే.