ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో తాజాగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. ఇప్పటి వరకు జోగులాంబ గద్వాల జిల్లాలో 21, మహబూబ్‌నగర్‌లో 11, నాగర్‌కర్నూల్‌లో 2 కేసులు నమోదయ్యాయి. మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల నుంచి పంపిన నమూనాల్లో పాజిటివ్ కేసులు ఏమీ లేవు. జోగులాంబ గద్వాల ఫలితాలు రావాల్సి ఉంది. తాజాగా వచ్చిన ఫలితాల్లో పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడం వల్ల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటి వరకు కరోనా కేసులు నమోదైన ప్రాంతాల మీద అధికార యంత్రాంగం దృష్టి కేటాయించింది. ఆయా ప్రాంతాల్లో పకడ్బందీగా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ప్రజలెవరూ బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. వారికి అవసరమైన నిత్యావసరాలు అధికారులు సరఫరా చేస్తున్నారు.
ప్రతిరోజూ క్రిమిసంహారక రసాయనాలు పిచికారీ చేయటం, డ్రోన్ కెమెరాలతో జనాల కదలికలు గమనించడం, జియో ట్యాగింగ్‌తో హోం క్వారంటైన్లో ఉన్న వారిపై నిఘా కొనసాగుతున్నాయి. హాట్స్పాట్లు కాకుండా మిగిలిన ప్రాంతాల్లో జన సంచారాన్ని నియంత్రించేందుకు పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. సరైన కారణం లేకుండా బయటకు వస్తే.. వాహనాలు సీజ్ చేయడం, కేసులు నమోదు చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. రాత్రి సమయంలో కర్ఫ్యూ పకడ్బందీగా కొనసాగుతున్నది. గ్రామాల్లో ఉపాధి హామీ పనులు, ధాన్యం కొనుగోళ్లు నడుస్తున్నాయి.
ఇదీ చూడండి: మే 3 వరకు లాక్డౌన్ పొడిగింపు- మోదీ ప్రకటన