మహబూబ్నగర్ జిల్లాలో భారీవర్షాలు కురుస్తున్నందున.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లుంటే వెంటనే కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు. మహబూబ్నగర్ పట్టణంలో వరదనీరు పోటెత్తిన రామయ్య బౌలీ, బీకే రెడ్డి కాలనీ, బృందావన్ కాలనీలతో పాటు తదితర ప్రాంతాలను మంత్రి సందర్శించి, పరిస్థితిని సమీక్షించారు.
ఇళ్లలోకి నీళ్లు రావడానికి, కాలనీల్లో నీళ్లు నిల్వ ఉండటానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. నాలా ఆక్రమణల కారణంగానే వరద నీరు కాలనీలను, ఇళ్లను ముంచెత్తుతోందని.. ఎక్కడైనా నాలా ఆక్రమణలకు గురైతే ప్రజలు అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.
ఇప్పటికే చాలాచోట్ల నాలాపై ఆక్రమణలను తొలగించామని.. ప్రస్తుత వరదల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా.. పక్కా ప్రణాళిక రూపొందించుకునేందుకు ఇదో అవకాశమన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండి.. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. పట్టణానికి ఆనుకుని ఉన్న అన్ని చెరువులు అలుగులు పారుతున్నాయని.. ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఇవీ చూడండి: 6.74లక్షల ఎకరాలకు సాగు నీరే లక్ష్యం... సీతారామతో సాధ్యం