మహబూబ్నగర్ జిల్లాలో కోటి మొక్కలు నాటాలన్న లక్ష్యాన్ని సమష్టిగా పూర్తి చేసేందుకు, అన్ని వర్గాలూ భాగస్వామ్యం కావాలని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. మొక్కలు నాటి ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి గ్రామంలో ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు పాఠశాలకే కాకుండా.. గ్రామానికి హెడ్మాస్టర్లుగా మారి, మొక్కలు నాటడాన్ని ప్రోత్సహించాలన్నారు.
ఖాళీ స్థలాల చుట్టూ ప్రహారిలా.. ఉపాధి హామీ కింద మొక్కలు నాటించాలని సూచించారు. గ్రామాలు, మున్సిపాలిటీ నిధుల్లో 10శాతం పచ్చదనానికి నిధులు కేటాయిస్తున్నామని చెప్పిన ఆయన.. నాటిన ప్రతి మొక్క బతికేలా చూడాలని నిర్ధేశించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం మన్యంకొండలో శ్రీవారి హరిత వనం పేరిట లక్షల మొక్కలు పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.
ఒకప్పుడు తాగేందుకు సైతం నీళ్లు లేని పాలమూరు జిల్లాలో మొక్కలు పెంచడం కేవలం మొక్కుబడి వ్యవహారంగా ఉండేదన్నారు. ప్రస్తుతం ప్రతి గ్రామంలో మొక్కలకు నీళ్లు పోసేందుకు ట్రాక్టర్ను ఏర్పాటు చేశామని, కావాల్సిన నీళ్లు అందిస్తున్నామని అన్నారు. కాలక్రమేణా అంతరించి పోతున్న అరుదైన మొక్కలు, వృక్షజాతుల పరిరక్షణకు సైతం రామకృష్ణ మిషన్ కృషి చేస్తోందని ఆయన గుర్తు చేశారు.
ఇదీ చూడండి: కలప దొంగలను క్షమించే ప్రసక్తే లేదు: కేసీఆర్