కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఫంక్షన్ హాల్స్‌లో ఎలాంటి పెళ్లిళ్లు, ఫంక్షన్లు, సమావేశాలు పెట్టుకోవద్దని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. మహబూబ్‌నగర్ లోని రెవిన్యూ సమావేశ మందిరంలో ఫంక్షన్ హాళ్ల యజమానులు, వివిధ మతపెద్దలతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ రాకుండా తీసుకుంటున్న ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా పెళ్లిళ్లు, ఫంక్షన్లు, సమావేశాలు నిర్వహించకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 14న జిఓ ఆర్ టి నెంబర్ 4 ద్వారా స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఈనెల 31 తర్వాత పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు, సమావేశాల కోసం ఫంక్షన్ హాల్స్ ను బుక్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
ఇదివరకే నిర్ణయించబడిన పెళ్లిళ్లు మాత్రం కేవలం 200 మంది కంటే ఎక్కువ జనం లేకుండా నిర్వహించుకోవాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలు అధిగమిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని, 31 తర్వాత ఫంక్షన్ హాల్స్ బుక్ చేసుకున్నట్లు తెలిస్తే సీజ్ చేస్తామని హెచ్చరించారు. అన్ని మతాల ప్రజలు ప్రార్థనా స్థలాలకు రాకుండా ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవాలని మంత్రి సూచించారు.
ఇదీ చూడండి: 'కరోనాపై యుద్ధం కోసం.. వచ్చే ఆదివారం జనతా కర్ఫ్యూ'