రెండోదశ కరోనా ఉద్ధృతితో రాష్ట్రంలో అనేక మంది ఆస్పత్రుల పాలయ్యారు. ఫలితంగా వైద్యసిబ్బందిపై ఒత్తిడి పెరిగింది. డాక్టర్లపై అదనపు భారాన్ని తగ్గించేందుకు సర్కారు చేపట్టిన చర్యలు మంచి ఫలితాలిచ్చాయి. వైద్య విద్య చదువుతున్న చివరి సంవత్సరం విద్యార్థుల సేవలు వినియోగించుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించాయి. తక్షణమే వివిధ మెడికల్ కళాశాలల్లో వైద్య విద్య పూర్తయి ఫలితాల కోసం వేచి చూస్తున్న వారికి విధులను అప్పగించాయి.
140 మంది విద్యార్థులు
మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 140 మంది చివరి సంవత్సరం వైద్య విద్యార్థులున్నారు. ఆ ఫలితాలు రాగానే.. ప్రభుత్వ దవాఖానల్లో హౌస్‌సర్జన్లుగా వైద్యసేవలు అందించాల్సి ఉంటుంది. కానీ.. ఫలితాలకు రెండు వారాల ముందే వీరు సేవలు అందిస్తున్నారు.
ముందుకొచ్చారు..
కరోనా కారణంగా దవాఖానాల్లో వైద్యుల అవసరాన్ని గుర్తించిన విద్యార్థులు... సీనియర్ వైద్యులకు తమవంతు సాయం అందించేందుకు ముందుకొచ్చారు. ప్రస్తుతం జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీతోపాటు వివిధ విభాగాల్లో వైద్యాధికారులు వీరి సేవలను వినియోగించుకుంటున్నారు. చదువు పూర్తికాకముందే ప్రజలకు వైద్యం చేయడం గొప్ప అవకాశమని వైద్య విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వెసులుబాటు..
ఏడాదిగా మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్యులు నిరంతరాయంగా సేవలందిస్తున్నారు. ఎంతో మంది వైద్యులు కొవిడ్ బారిన పడినా.. చికిత్స అనంతరం మళ్లీ సేవలందిస్తున్నారు. ఈ సమయంలో వైద్య విద్యార్థుల సేవలతో ఎంతో వెసులుబాటు కలిగిందని అధికారులు చెబుతున్నారు. చివరి ఏడాది పరీక్షల ఫలితాలు వచ్చాక... పూర్తిస్థాయిలో హౌస్ సర్జన్లుగా వైద్య విద్యార్థుల సేవలు వినియోగించుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
- ఇదీ చదవండి : Software Engineer: కొలువు వదిలేసి.. పొలం బాటపట్టి!