జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లోని ప్రభుత్వ కళాశాల సమస్యల వలయంలో చిక్కుకుంది. మౌలిక వసతులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. పదేళ్ల క్రితం మానవపాడు మండల నుంచి ఇంటర్మీడియట్ విద్య కోసం అలంపూర్, గద్వాల్‌కి వెళ్లి చదువుకునే వారు. ఈ ఇబ్బందులను గమనించి గంగుల వెంకట కృష్ణారెడ్డి 5 ఎకరాల స్థలం విరాళంగా ఇచ్చారు. అయితే ఐదెకరాల విశాలమైన స్థలం ఉన్నప్పటికీ అభివృద్ధికి నోచుకోక వెనుక బడుతోంది.
విద్యార్థుల సమస్యలు
కళాశాలకు ప్రహరీ లేకపోవడం వల్ల పశువులు ఆవరణలోకి వస్తున్నాయి. వాచ్మెన్ కాపలా లేకపోవడంతో రాత్రిపూట మద్యం సేవించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఉదయం తరగతి గదులకు వచ్చిన విద్యార్థినులు అసౌకర్యానికి గురవుతున్నారు. మరుగుదొడ్లు లేక వారు పడే బాధ వర్ణనాతీతం!
వినతులు బుట్టదాఖలు...
భవనం నల్లరేగడి నేలలో నిర్మించడం వల్ల వర్షం వచ్చినప్పుడు వరదకు కుంగింది. ఓ పక్కకు వంగడంతో ఎప్పుడు కూలుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. దీనిపై రాజకీయ నాయకులకు, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కనీస వసతులు కరవు...
ఎంపీసీ, బైపీసీ తరగతుల్లో సరైన సౌకర్యాలు లేవని, ప్రయోగశాలలు లేక సబ్జెక్టుల్లో మార్కులు తక్కువగా వస్తున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. ప్రతిఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని అదనపు గదులను మంజూరు చేసి మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నారు.