ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. కుండపోత వానలు కురిసినప్పుడల్లా మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల లాంటి పురపాలికల్లో పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. ప్రధాన రహదారులు సహా వీధులు జలమయమవుతున్నాయి. ఇళ్లలోకి నీరు వచ్చి చేరుతోంది. ఎప్పుడు భారీ వర్షాలు కురిసినా అదే పరిస్థితి. కారణం... పట్టణంలోకి వచ్చిన వరదను సాఫీగా పట్టణం బయటకు పంపే వాగులు, వరద కాల్వలను ఎక్కడికక్కడ కబ్జా చేశారు. వెడల్పాటి కాల్వలను చిన్న మురుగు కాల్వలుగా మార్చేశారు. ఆ ఆక్రమణలే ముంపునకు దోహదం చేస్తున్నాయి.
మహబూబ్నగర్లో..
మహబూబ్నగర్ పట్టణంలో పెద్ద చెరువు కింద ఉన్న కాలనీలు వర్షాలు వచ్చినప్పుడల్లా జలమయమవుతాయి. పెద్ద చెరువు వరద కాల్వ... మురుగు కాల్వగా మారడమే ఇందుక కారణం. దీంతో చెరువు నిండినప్పుడల్లా... అలుగు పారి కింది ప్రాంతాల్లో మురికి కాల్వల ద్వారా వరద కాలనీల్లోకి వచ్చేస్తుంది. పట్టణంలోని భారీ వరదను మోసుకెళ్లే ఐదు ప్రధాన వాగులు కబ్జాలకు గురై కుంచించుకుపోయాయి. ఒకప్పటి నాలాల వెడల్పును తగ్గించి... అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారు. ఆ భూముల్ని అమ్ముకుంటున్నారు. ఇప్పుడున్న నాలాలపై అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారు. దీంతో చిన్న వానకే...పట్టణం నీటితో నిండిపోతోంది.
జడ్చర్లలో..
జడ్చర్లలోనూ అదే పరిస్థితి. పట్టణంలో ప్రధానంగా ఐదు వరద కాల్వలున్నాయి. 70 వరకు పిల్ల కాల్వలున్నాయి. ఒక్కో వరద కాల్వ పొడవు ఐదు కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఒకప్పుడు ఈ కాల్వల వెడల్పు 30 అడుగుల ఉండేది. భూములకు డిమాండ్ పెరగడం వల్ల నాలాలు ఆక్రమించారు. ఇళ్లు సహా పలు నిర్మాణాలు చేపట్టారు. దీంతో కాల్వల వెడల్పు 5 నుంచి 10 అడుగులకు తగ్గిపోయింది. నాలాలపైనా అక్రమ నిర్మాణాలు వెలిశాయి. ఫలితంగా గట్టి వానొస్తే చాలు.. ఆయా కాలనీలు జలమయమవుతున్నాయి. శివాజీనగర్, పాతబజార్, నల్లకుంట, నాగర్కర్నూల్ ప్రధాన రహదారి, వెంకటరమణ థియేటర్, చైతన్యనగర్ లాంటి ప్రాంతాల్లో చిన్న వానొచ్చినా కాల్వలు పొంగి ఇళ్లలోకి నీళ్లు వచ్చి చేరుతున్నాయి. నాలా ఆక్రమణలు తొలగించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకున్న నాథుడే లేడని... పట్టణవాసులు వాపోతున్నారు.
వనపర్తిలో..
జిల్లా కేంద్రాలైనా గద్వాల, వనపర్తి లాంటి మున్సిపాలిటీల పరిస్థితి సైతం అధ్వాన్నంగా తయారైంది. వనపర్తిలో తాళ్ల చెరువు అలుగు పారితే... వరద నీరు పట్టణాన్ని ముంచెత్తింది. పట్టణంలోని 3 ప్రధాన వరద కాల్వలు, చెరువులకు అనుసంధానంగా ఉండే వాగులు అక్రమణకు గురికావడం వల్ల... శ్వేతనగర్, బ్రహ్మంగారి వీధి, శంకర్ గంజ్, సుభాష్ వాడ, జిల్లా ఆసుపత్రి వీధి లాంటి ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాలు కురిస్తే చాలు... వనపర్తి పట్టణ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటున్నారు.
గద్వాలలో..
గద్వాలలో ఒకప్పటి సంస్థానాధీశులు నిర్మించిన కందకాలను కబ్జా చేశారు. మార్కెట్ యార్డు నుంచి నల్లకుంట మీదుగా వెళ్లే వరద కాల్వపై దుకాణాలు వెలిశాయి. దీంతో నల్లకుంటలో ఇళ్లలోకి నీరు చేరుతోంది. రాజీవ్‌మార్గ్‌లో రోడ్లపైకి వరద వస్తోంది. నాలాపై స్లాబులు నిర్మించటం వల్ల... పలు కాలనీలు జలమయమవుతున్నాయి. ఏటా వానలొచ్చినప్పుడల్లా వరద ముంచెత్తడం... నాలా ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకోవడం అధికారులకు పరిపాటిగా మారింది. అంతేగాని.. ఆక్రమణల తొలగింపునకు మాత్రం అధికారులు ముందుకు రావడం లేదు. వరదలు ముంచెత్తినప్పుడో... ప్రమాదాలు జరిగినప్పుడో... కాల్వల మీద చిన్న నిర్మాణాలు కూల్చేసి మమ అనిపించడం తప్ప.. వరదను బైటకు పంపే చర్యలకు మున్సిపాలిటీలు పూనుకోవడం లేదు.
పట్టణ ప్రగతిలో భాగంగానైనా... నాలాల కబ్జాలు, అక్రమణలు గుర్తించి వాటిని తొలగించాలని జనం డిమాండ్ చేస్తున్నారు. మరోసారి వరద ముంచెత్తకుండా ఉండాలంటే వరద కాల్వల సామర్థ్యాన్ని పెంచడం, ఆక్రమణలపై ఎప్పటికప్పుడు కొరడా ఝుళిపించాలని జనం సూచిస్తున్నారు.
ఇదీ చూడండి: పట్టభద్రుల ఎన్నికల్లో కామ్రేడ్స్ నిర్ణయమేంటి.. ?