తెలంగాణలోనే అత్యధికంగా విత్తనపత్తి సాగయ్యే ప్రాంతం జోగుళాంబ గద్వాల జిల్లా. సుమారు 60వేల ఎకరాల్లో జిల్లాలో విత్తనపత్తి సాగవుతూ ఉంటుంది. అయితే ఈ ఏడాది విత్తనపత్తి సాగు చేసిన రైతులకు నష్టం తప్పేలా లేదు. దీనికి కారణం అధిక వర్షాలు. జోగులాంబ గద్వాల జిల్లాలో సెప్టెంబర్ 6 నాటికి 310.8 మిల్లీ మీటర్ల సాధారణ వర్షపాతం కురవాల్సి ఉండగా.. 632.9 మిల్లీ మీటర్ల వర్షం పడింది. గత ఏడాది వర్షపాతంతో పోల్చినా.. సుమారు 120 శాతం అధికంగా వర్షాలు పడ్డాయి. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో ఇప్పటి వరకూ 40 రోజుల పాటు వర్షాలు పడ్డాయి. ఈ వాతావరణ పరిస్థితి విత్తనపత్తి సాగు చేస్తున్న రైతులకు శాపంగా మారింది. సాధారణంగా ఆగస్టులో విత్తనపత్తిలో పరపరాగ సంపర్కం ప్రక్రియ చేపడతారు. సుమారు 60రోజుల పాటు ఇది కొనసాగుతుంది. మొగ్గలు రావడం, కాయలు రావడం అన్నీ జరిగేది ఇప్పుడే. డిసెంబర్ నాటికి ఏకంగా పంట చేతికి వస్తుంది. కానీ ఈ ఏడాది అలా జరగడం లేదు. ప్రస్తుతం మొగ్గలు రావడం ఆగిపోయాయి. వర్షాలు తగ్గితే మొగ్గలవే వస్తాయని ఎదురు చూసిన రైతులకు పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి.
మరోవైపు... ప్రతి పత్తిచెట్టుకు ఈ సమయానికి వంద నుంచి 200కాయల వరకు కాయాల్సి ఉండగా.. 50, 60 మాత్రమే కాస్తున్నాయని రైతులు వాపోతున్నారు. ఇలా తక్కువ కాయలు రావడం, మొగ్గలు రాకపోవడం, పరపరాగ సంపర్కం సకాలంలో జరగకపోతే.. దిగుబడి తగ్గిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో పాటు కంపెనీకి అందించే విత్తనాలు జీవోటి పరీక్షల్లో విఫలమవుతాయన్న ఆందోళన రైతులను వెంటాడుతోంది.
ఒక్కో రైతు విత్తనపత్తిని సాగు చేసేందుకు సుమారు 70వేల నుంచి లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెడతారు. కౌలుకు తీసుకుని విత్తనపత్తి సాగుచేసే వారికి పెట్టుబడి మరింత అధికం. కర్ణాటక రాష్ట్రం నుంచి కూలీలను తీసుకువచ్చి వినియోగిస్తారు. పెట్టుబడి కోసం మధ్యవర్తులపై ఆధారపడతారు. వందకు 2 నుంచి 3 రూపాయల వరకూ వడ్డీకి అప్పులు చేస్తారు. ఒకవేళ విత్తనపత్తి మొగ్గలు రాకపోయినా, కాత లేకపోయినా పెట్టిన పెట్టుబడిని నష్టపోవడంతో పాటు.. అప్పుల పాలవుతామని రైతులు వాపోతున్నారు. వాతావరణం కారణంగానే పూత, కాత రావడం లేదని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు శాస్త్రవేత్తలను రప్పించనున్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి గోవింద్ నాయక్ వెల్లడించారు.విత్తనపత్తి సాగు చేసిన రైతులు నష్టపోకుండా జిల్లా అధికారులతో పాటు.. ఆర్గనైజర్లు, కంపెనీలు తగిన చర్యలు తీసుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: ఖాజిపల్లి అర్బన్ ఫారెస్ట్‌ను దత్తత తీసుకున్న ప్రభాస్