అంతరించిపోతున్న అడవులకు ప్రకృతి వనాలతో ప్రభుత్వం జీవం పోస్తోంది. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ఊరికో వనాన్ని ఏర్పాటు చేస్తోంది. పల్లెల్లో పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణం పెంపొందించేందుకు ఏర్పాటు చేస్తున్న ప్రకృతివనాలు.. క్షేత్రస్థాయిలో సత్ఫలితాలనిస్తున్నాయి. పట్టణాలకే పరిమితమైన ఉద్యానవాలను... పల్లె ముంగిళ్లలోకి తీసుకురావడంతో హరితశోభ సంతరించుకుంటున్నాయి. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కొడవటిమెట్టు, ఏన్కూరు మండలం నూకాలంపాడు గ్రామ పంచాయతీలు వందశాతం పనుల పూర్తితో ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఈ రెండు గ్రామాల సర్పంచ్‌లకు ఉత్తమ పురస్కారాలు దక్కాయి.
అందమైన ప్రకృతి వనం
కొడవటిమెట్టులో సర్పంచ్ నిర్మల... ప్రకృతివనాన్ని సుందరంగా తయారు చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి పూలమొక్కలు, ఆహ్లాదం పంచే మొక్కలు, ఔషధ మొక్కలు తెచ్చి నాటారు. వాటి సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. వనంలో రహదారులు, బల్లాలు సైతం ఏర్పాటు చేశారు. ఇటీవల పార్కును ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, పలువురు ఉన్నతాధికారులు సర్పంచ్‌ను అభినందించారు. నిర్మల దంపతులను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సత్కరించారు.
ఉత్తమ సర్పంచ్
ఏన్కూరు మండలం నూకాలంపాడులో సర్పంచ్ శేషగిరిరావు.. గ్రామాభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకృతివనం మంజూరు చేయగానే.. తానే దుక్కిచేసి మొక్కలు నాటారు. తెలంగాణ తల్లి విగ్రహం, పచ్చటి లాన్‌ల ఏర్పాటుతో పార్కును ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. వైకుంఠధామంలో శివుడి విగ్రహం, కాటికాపరి విగ్రహం, కొబ్బరి వనం, చక్కటి రహదారి సౌకర్యం కల్పించి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందారు. ఉత్తమ సర్పంచ్‌గా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ నుంచి పురస్కారం పొందారు.
అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతోనే గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయని.. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు.