Podu lands issue: పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించకపోవటంతో.... నిత్యం ఏదో ఒక చోట ఆదివాసీలకు, అటవీశాఖ అధికారుల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అలాంటిదే మరో ఘటన జరిగింది.
వాహనాలను అడ్డుకున్న రైతులు..
Podu controversy: టేకులపల్లి మండలం జంగాలపల్లి బీట్ పరిధిలో ఉన్న.... ఆళ్లపల్లి మండలం రాయపాడులో పోడు రైతులకు, అటవీ అధికారులకు మధ్య ఘర్షణ నెలకొంది. సాగుచేసుకుంటున్న పోడు భూముల్లో కందకం పనులు చేయించేందుకు అటవీశాఖ అధికారులు యంత్రాలతో వచ్చారు. విషయం తెలుసుకున్న ఆ భూములకు చెందిన రైతులు అక్కడి చేరుకుని.... వాహనాలను అడ్డుకున్నారు.
ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోడు భూముల దరఖాస్తుల పరిశీలన ఉండగానే.... తమకు జీవనాధారమైన పొలాలను లాక్కునేందుకు యత్నించటం సరికాదని బాధితులు వాపోయారు. దశాబ్దాలుగా పోడు భూమిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నామని... భూములకు పట్టాలు వస్తాయని ఆశ పడుతున్న తమకు అటవీ శాఖ అధికారులతో ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యంత్రాలతో పనులు ప్రారంభించిన అటవీ సిబ్బంది, పోడు రైతుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో పనులను నిలిపివేశారు.
ఇదీ చదవండి:TET 2022: ఉపాధ్యాయ అర్హత పరీక్ష వారు కూడా రాసుకోవచ్చు