ఖమ్మంలో రాష్ట్ర మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డిలు పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. నగరంలో ఐటీ హబ్ రెండో దశకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అంకురార్పణ చేశారు. రూ.30 కోట్లతో నిర్మించనున్న రెండో టవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ ఐటీ హబ్ రెండో టవర్ నిర్మాణం ద్వారా మరో 500 మందికి ఉపాధి లభించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. మొదటి టవర్‌లో ప్రస్తుతం 500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ ఆవిర్భావం నుంచి ఐటీ రంగం దూసుకుపోతోందని కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో పెట్టుబడులపై చాలా మంది అనుమానపడ్డారని చెప్పారు. కానీ.. ప్రస్తుతం ఐటీ రంగంలో దేశంలోనే గణనీయమైన వృద్ధి నమోదు చేశామని వెల్లడించారు. 2021లో లక్షా 40 వేల కోట్ల వరకు పెట్టుబడులు పెరిగాయని తెలిపారు.
ప్రముఖ ఐటీ కంపెనీలు హైదరాబాద్ బాటపడుతున్నాయన్న కేటీఆర్.. ఐటీ రంగాన్ని ద్వితీయశ్రేణి నగరాలకు విస్తరిస్తున్నామని చెప్పారు. త్వరలో నల్గొండ, సిద్దిపేట, రామగుండంలో ఐటీ హబ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించడమే ఐటీ హబ్‌ల లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఈ-ఫైబర్ ద్వారా రాష్ట్రంలో కోటి ఇళ్లకు ఇంటర్నెట్ కనెక్షన్లు అందిస్తామని తెలిపారు.