ఖమ్మం జిల్లాలో వైఎస్ షర్మిల భారీ బహిరంగ సభకు ప్రణాళిక సిద్ధమవుతోంది. ముఖ్య నేతలతో చర్చించేందుకు ఆమె ముఖ్య అనుచరుడు కొండా రాఘవరెడ్డి ఈరోజు ఖమ్మంలో పర్యటించనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాలకు చెందిన నాయకులతో సమావేశం నిర్వహిస్తారు.
ఏప్రిల్ 9న బహిరంగ సభ నిర్వహించాలని షర్మిల నిర్ణయించిన నేపథ్యంలో జనసమీకరణ, ఇతర ఏర్పాట్లకు సంబంధించి ఆయన స్థానిక నాయకులతో చర్చించనున్నట్లు సమాచారం. సభకు ముందు ఉమ్మడి జిల్లా నాయకులతో ఆమె సమీక్షిస్తారు. నగరంలో వాహనాలతో పెద్ద ఎత్తున ర్యాలీ ఉంటుంది. బహిరంగ సభావేదికపై నుంచి పార్టీకి సంబంధించిన కీలక వివరాలను షర్మిల వెల్లడించే అవకాశాలు ఉండటంతో సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు.