YS Sharmila: వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర 69వ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో కొనసాగింది. ఆనందపురం గ్రామానికి వచ్చిన షర్మిలకు మహిళలు పూలమాలలు వేసి ఆహ్వానం పలికారు. అనంతరం రైతు ఘోష దీక్షలో షర్మిల పాల్గొన్నారు. గిరిజనులు, నిరుపేదలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా... వారి నుంచి బలవంతంగా భూములు లాక్కుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ప్రధానంగా ఉన్న పోడు భూములు సమస్యను పరిష్కరించేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఎస్సీ , ఎస్టీ, బడుగు బలహీన వర్గాలపై ఉన్న ప్రేమను తెలియజేస్తున్నాయని షర్మిల ఆరోపించారు.
'గిరిజనులు ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా సీఎం కేసీఆర్ మోసం చేశారు. ప్రభుత్వం చేపట్టే పల్లె ప్రకృతి వనం, శ్మశాన వాటికలు, నూతన కార్యాలయాల నిర్మాణం కోసం, బలవంతంగా లాక్కుంటున్నారు. మేము అధికారంలోకి వస్తే పోడు భూములకు పట్టాలు ఇవ్వటంతో పాటు రైతులకు అండగా నిలుస్తాం. ఈ ప్రాంతంలో ఉన్న పోడుభూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఎన్నికల సమయంలో... పోడు భూములకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్... వాటిని ఎందుకు అమలు చేయలేదు?'-వైఎస్ షర్మిల, వైతెపా అధ్యక్షురాలు
కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని దొంగల, దోపిడి రాజ్యంగా మార్చారని షర్మిల విమర్శించారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చారని తెలిపారు. ఆయన బాటలోనే తాను వెళ్తానన్నారు. రైతులు పండించిన పంటనూ కొనుగోలు అంశాన్ని సీఎం రాజకీయం చేయటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి:Kishan Reddy On Kcr: 'కేసీఆర్.. ఫ్రంట్‌లు, టెంట్‌లు పెట్టుకోవచ్చు'