ఖమ్మం జిల్లా పాలేరు, మధిర నియోజకవర్గాల్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొదట ముదిగొండ మండలంలోని కొత్త లక్ష్మీపురంలో 2 కోట్ల 25 లక్షల రూపాయలతో నిర్మించిన కస్తూర్భా బాలికల విద్యాలయాన్ని ప్రారంభించారు.
అనంతరం పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలంలో 12 కోట్లతో నిర్మించనున్న నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. రెండు కోట్ల 25 లక్షల రూపాయలతో డిగ్రీ కళాశాలలో నిర్మించిన భవనాన్ని ప్రారంభించారు. కూసుమంచి మండలం గట్టు సింగారంలో కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలను ప్రారంభించారు. పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
"గురుకుల పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థిపై తెలంగాణ ప్రభుత్వం సంవత్సరానికి లక్షా ఇరవై వేల రూపాయల ఖర్చు చేస్తోంది. ప్రభుత్వం 4 మోడల్ డిగ్రీ కళాశాలను నిర్మించ తలపెట్టింది. ఆ కళాశాల నేలకొండపల్లి మండలానికి రావడం అభినందనీయం. విద్యార్థులు కళాశాలలో చేరి బాగా చదువుకొని అభివృద్ధి చెందాలి. ప్రైవేటు కంటే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు ఏ మాత్రం తక్కువ కాదు."
-సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి
ఇదీ చూడండి: ప్రభుత్వ తీరుతో అగ్రవర్ణాల్లోని పేదలు నష్టపోయారు: బండి