రాష్ట్రంలోని ప్రతి పేద ఆడపిల్ల పెళ్లికి సీఎం కేసీఆర్ మేనమామలాగా ఆర్థిక సాయం చేస్తున్నాడని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో కల్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం 248 మంది లబ్ధిదారులకు రూ.2 కోట్ల 48 లక్షల 52 వేల విలువైన చెక్కులు అందజేశారు.
కష్టకాలంలోనూ రాష్ట్రంలోని ప్రతీ పేద ఇంటికి ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలుస్తోందని మంత్రి తెలిపారు. ఖమ్మం నియోజకవర్గంలో తానే స్వయంగా రూ. 25 కోట్ల చెక్కులు అందజేశానన్నారు. ఇలాంటి మంచి ఆలోచనలు సీఎం కేసీఆర్ మాత్రమే చేయగలడని కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, రాములునాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.