ఖమ్మంలోని జయనగర్ కాలనీకి చెందిన అహ్మద్, రెహానా బేగం దంపతులకు నలుగురు ఆడపిల్లలు. వీరిలో పెద్ద కూతురు మహమ్మద్ ఫర్హా. తండ్రి అహ్మద్ టైలర్. తల్లి గృహిణి. చిన్నతనం నుంచే ఫర్హా చదువుల్లో రాణించారు. పదోతరగతి, ఇంటర్, డిగ్రీల్లో తనకు పోటీలేదని నిరూపించారు ఫర్హా. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా 19 ఏళ్లకే మహమ్మద్ ఆసిఫ్‌తో నిఖా జరిగింది. ఓ వైపు గృహిణిగా తన బాధ్యతలను నెరవేరుస్తూనే.. ఎంబీఏ పూర్తి చేశారామె. కుటుంబపోషణ కోసం పాఠశాలలు, కళాశాలల్లో అధ్యాపకురాలిగా చేరారు. భార్యగా... ఇద్దరు పిల్లలకు తల్లిగా... కోడలిగా... కూతురిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ అందరి అభిమానాన్ని చూరగొన్నారు.
15 ఏళ్లనాటి కలకు చిగురు..
చిన్నతనం నుంచే ఆధునిక భావజాలం, తనదైన ముద్రవేయాలన్న పట్టుదల మెండుగా ఉన్న ఫర్హా... ఏదైనా రంగంలో జాతీయ స్థాయి గుర్తింపు దక్కించుకోవాలన్న లక్ష్యాన్ని మాత్రం మరిచిపోలేదు. 15 ఏళ్ల వయసులో తానకున్న లక్ష్యాన్ని చేరేందుకు ఉన్న అడ్డుగోడలన్నింటినీ అనుకువతో కూలదోసుకుంటూ వచ్చారు. 2020 జూలైలో సామాజిక మాధ్యమాల్లో ఫర్హా చూసిన ఓ ఆన్లైన్ వీడియో ప్రకటన... ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది.
ఆన్లైన్ ఆడిషన్స్‌లో విజయం...
మిసెస్ ఇండియా పోటీల్లో సత్తా చాటే మహిళల కోసం వీపీఆర్ అనే సంస్థ ఇచ్చిన వీడియో ప్రకటన చూసి ఎలాగైనా ప్రయత్నించాలనుకుంది. కుటుంబసభ్యుల అంగీకారంతో ఆడిషన్స్‌లో పాల్గొంది. దేశవ్యాప్తంగా 912 మంది మహిళలు ఈ ఆడిషన్స్‌లో పాల్గొన్నారు. దాదాపు 6 నెలల పాటు సుదీర్ఘంగా సాగిన ఆన్లైన్ ఆడిషన్స్‌లో అన్ని విభాగాల్లో సత్తా చాటింది. ఫిట్నెస్, డైట్, వ్యక్తిత్వం, సోషల్ మీడియా అవగాహన, మానసిక స్థైర్యం, సంప్రదాయాలు, ప్రతిభ, ర్యాంప్‌వాక్ వంటి విభాగాల్లో ఆన్లైన్ ఎంపికల్లో విజయం సాధించింది.
బెస్ట్ ఫోటోజెనిక్ ఫేస్‌గా...
మొత్తం 912 మంది మహిళల్లో ఫైనల్ పోటీలకు ఎంపికైన 41 మందిలో ఒకరిగా నిలిచింది ఫర్హా. ఈ ఏడాది ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు నాలుగు రోజుల పాటు అహ్మదాబాద్‌లో జరిగిన మిసెస్ ఇండియా ఫైనల్ పోటీల్లో పాల్గొంది. గ్రూమింగ్, ర్యాంప్ వాక్, సంప్రదాయ వస్త్రాల ప్రదర్శన వంటి పలు రౌండ్లలో తళుక్కున మెరిసింది. జాతీయతను ప్రతిబింబించేలా దుస్తులు ధరించి చేసిన నృత్యం పోటీలో ముందు వరసలో నిలబెట్టింది. ఫైనల్లో తుది ఆరుగురిలో ఒకరిగా నిలిచి... టైటిల్ పోరులో తొలి రన్నరప్‌గా నిలిచింది. తొలి ప్రయత్నంలోనే మిసెస్ ఇండియా రన్నరప్‌గా నిలవడం విశేషం. ఈ పోటీల్లోనే బెస్ట్ ఫోటోజెనిక్ ఫేస్గానూ ఫర్హా ఎంపికైంది.
స్టేటస్ కూడా పెట్టుకోలేదు...
మిసెస్ ఇండియా రన్నరప్‌గా నిలవడం తన జీవితంలో మరుపురాని అనుభూతినిస్తుందని ఫర్హా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తన పేరు పక్కన మిసెస్ ఇండియా చేరడం చూసి ఫర్హా మురిసిపోయారు. నిన్నమొన్నటి వరకు కనీసం వాట్సాప్ స్టేటసుల్లోనూ తన ఫొటో పెట్టుకోని తాను... ప్రస్తుతం వేలాది మందికి సెల్ఫీలివ్వడం గర్వంగా ఉందని ఉబ్బితబ్బిబవుతన్నారు. తల్లి సాధించిన విజయాన్ని చూసి ఆమె పిల్లలు మురిసిపోతున్నారు.
కుటుంబ సభ్యుల సహకారంతోనే దేశ యవనికపై సత్తా చాటానని ఫర్హా తెలిపింది. సెలబ్రిటీగా మారిన తన జీవితాన్ని మహిళా సాధికారత కోసం కేటాయిస్తానంటోంది. మహిళల హక్కులు, బాలికా విద్య కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఈ అందమైన అమ్మ చెబుతోంది.
సామాజిక సేవలోనూ...
అందం, అభినయంతో సత్తా చాటిన ఫర్హా... సామాజిక సేవలోనూ ముందు వరుసలో ఉంటోంది. హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ సంస్థకు రాష్ట్ర కార్యదర్శిగా..ఉమెన్ ఎంపవర్మెంట్ విభాగానికి కార్యదర్శిగా పని చేస్తోంది ఫర్హా మహిళలు గృహిణిలుగానే మిగిలిపోకుండా... ఇష్టమైన రంగాల్లో రాణించాలన్నదే తాను నమ్మిన సిద్ధాంతమని... దానికోసం తనవంతు కృషి చేస్తానని చెబుతోంది మిస్సెస్ ఇండియా రన్నరప్ ఫర్హా.