ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్టు(E-Voting pilot project)గా ఖమ్మం కార్పొరేషన్లో చేపట్టిన ఈ-ఓటింగ్ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. ఈ-ఓటు వేసేందుకు నగరంలో మొత్తం 3820 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా.. బుధవారం ఉదయం 7 గంటలకు మొదలైన నమూనా పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు సాగింది. ఉదయం నుంచి ఈ-ఓటింగ్ ఉత్సాహంగానే సాగింది. మొత్తం 2128 మంది యాప్ ద్వారా డమ్మీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇంకా 1702 మంది ఈ-ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. తొలి నాలుగు గంటల్లో 1000 మంది ఈ- ఓటు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 1 గంటల వరకు 1680 మంది, మధ్యాహ్నం 3 గంటల వరకు 1940, సాయంత్రం 5 గంటల వరకు 2128 ఓట్లు పోలయ్యాయి.
చిన్నచిన్న సమస్యలు మినహా..
ఈ-ఓటింగ్‌లో చిన్న చిన్న సమస్యలు మినహా అంతా సజావుగానే సాగింది. కేవలం రెండు మూడు నిమిషాల్లోనే ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. మొబైల్ యాప్‌లో తెలుగు, హిందీ భాషల్లో వివరాలు పొందుపరిచారు. ఆల్ఫా, బీటా, గామా, నోటాలతో నాలుగు గుర్తులు ఉంచారు. తెలుగు, హిందీలో ఆల్ఫా, బీటా, గామా, నోటా.. పేర్లు, వాటి పక్కనే గుర్తులు ఉండేలా బ్యాలెట్ పొందుపరిచారు. బ్యాలెట్ ఐడీ ఇచ్చారు. డమ్మీ ఓటు వేయగానే యాప్ దానిని రికార్డు చేసింది.
ఓటర్ల హర్షం..
ఈ-ఓటు వేసేందుకు మరికొంతమంది ఉత్సాహం చూపినప్పటికీ సాంకేతిక సమస్యలు, మొబైల్ ఫోన్లో ఇబ్బందుల కారణంగా ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. ఈ-ఓటు వేసేందుకు కొందరు ప్రయత్నించినప్పటికీ సాంకేతిక సమస్యలతో యాప్ తెరుచుకోలేదు. యాప్ మళ్లీ రీలోడ్ చేసుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేదు. మరికొంతమంది ఇంటి నుంచి ఓటు వేసేందుకు కూడా ఆసక్తి చూపలేదు. నమూనా ఈ-ఓటులో పాల్గొన్న వారంతా హర్షం వ్యక్తం చేశారు. ఈ-ఓటింగ్ సాగిన తీరుపట్ల జిల్లా అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓటర్ల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నామని తెలిపారు.
అవగాహన కల్పించాలి..
ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించేందుకు వీలు కల్పించేలా ఎన్నికలసంఘం వేసిన తొలి అడుగు సత్ఫలితాలను ఇచ్చింది. నిర్దేశిత లక్ష్యం మాత్రం నెరవేరింది. ప్రజలకు అవగాహన కల్పించకపోవడం వల్ల అనుకున్న ఫలితాలు రాలేదు. రిజిస్ట్రేషన్ల సమయంలో లక్ష్యాలు నిర్దేశించుకుని అవగాహన కార్యక్రమాలు, ఈ-ఓటు నమోదు చేపడితే మరింత ప్రయోజనం ఉండేది. ఈ-ఓటులో నమోదైన ఫలితాలు, సాంకేతిక సమస్యలు, ఇతర ఇబ్బందులను అధిగమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇదీ చూడండి: