ఖమ్మం జిల్లాలో క్రమంగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ కలకలం రేపుతున్నాయి. తొలిదఫాలో 8 కేసులు వచ్చినప్పటికీ.. పూర్తిగా కోలుకున్న జిల్లాలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. ఇప్పటి వరకు పట్టణాలకే పరిమితమైన కేసుల సంఖ్య లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాలకూ క్రమంగా విస్తరిస్తోంది. గత 19 రోజుల్లోనే మొత్తం 18 కేసులు నమోదయ్యాయి. వెలుగులోకి వచ్చిన కేసుల్లో ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాలకు చెందివే. జిల్లాలో తొలిసారిగా ఏప్రిల్ 6న తొలి పాజిటివ్ కేసు నమోదవ్వగా.. మొత్తం కేసుల సంఖ్య ఎనిమిదికి చేరి అక్కడి నుంచి తగ్గుతూ వచ్చింది. ఆ తర్వత మళ్లీ మే 18 తేదీన పాజిటివ్ కేసు నమోదుకాగా.. అప్పటి నుంచీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే వస్తోంది.
జిల్లాలనే అత్యధికంగా...
ప్రస్తుతం జిల్లాలనే అత్యధికంగా నేలకొండపల్లిలో 9 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఓ వ్యాపారి కుటుంబంలో నలుగురికి, ఆ వ్యాపారి దుకాణంలో పనిచేసే ఐదుగురు గుమస్తాలకు కరోనా సోకింది. ఇక జిల్లాలోనే తొలి కరోనా మరణానికి కేంద్రమైన మధిరలో.. వైరస్ సోకిన వారి సంఖ్య ఐదుకు చేరాయి. పుణెకు బతుకుదెరువు కోసం వెళ్లి వచ్చిన మధిర మండలానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకింది. అతడి నుంచి ఇంకో కుటుంబసభ్యునికి వైరస్ వ్యాప్తి చెందింది. వీరినుంచి పెనుబల్లి మండలం వీఎం బంజరకు చెందిన ఇద్దరికి మహమ్మారి సోకింది.
అధికారులు అప్రమత్తం..
తాజాగా సూర్యాపేట జిల్లాలోని ఓ బ్యాంకులో పనిచేసే మధిరకు చెందిన యువకుడికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. వీరితో పాటు ఖమ్మం నగరంలోని డాబాల బజార్‌కు చెందిన వ్యాపారికి, పాండురంగాపురానికి చెందిన మరో వ్యక్తికి కరోనా సోకింది. ఇలా జిల్లాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 18కి చేరింది. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అప్రమత్తమవుతోంది. పాజిటివ్ కేసులు వెలుగు చూసిన ప్రాంతాల్లో హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేస్తూ ఇంటింటి సర్వే చేపట్టారు.
ఇవీ చూడండి: లాక్డౌన్ ఎఫెక్ట్: చతికిల పడిన వ్యాయామం!