దేశ భవిష్యత్‌ను కొద్ది మంది వ్యాపారుల చేతుల్లో పెట్టేందుకే భాజపా ప్రభుత్వం వ్యవసాయ బిల్లును తీసుకొచ్చిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. వ్యాపారుల పార్టీగా మారిన భాజపా... కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేసేందుకే నూతన బిల్లులను ఆమోదింపజేసుకుందని ఆరోపించారు. గాంధీ జయంతి సందర్భంగా ఖమ్మం గాంధీ చౌక్‌లోని బాపూజీ విగ్రహానికి భట్టి విక్రమార్క పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్యర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ చేపట్టిన సంతకాల సేకరణలో పాల్గొన్నారు. కేంద్రం తీసుకున్న చర్యల వల్ల భవిష్యత్‌లో దేశానికి పెద్ద ప్రమాదం పొంచి ఉందని వ్యాఖ్యానించారు. మార్కెట్ యార్డులు లేకుండా, రైతులకు గిట్టుబాటు ధర దక్కకుండా చేసిన భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ ప్రజలంతా ఏకమవ్వాలని భట్టి సూచించారు.