కరోనా సోకి.. మృతి చెందిన వారిని మున్సిపాలిటీ వాళ్లే ఖననం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అయినవాళ్లు కూడా అంత్యక్రియలకు రాని ఘటనలు నిత్యం ఏదో ఒక మూల కనిపిస్తూనే.. ఉన్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో కరోనాతో మృతి చెందిన ఓ వ్యక్తి కుటుంబీకులు అతనికి అంత్యక్రియలు నిర్వహించడానికి ముందుకు రాలేదు. సమాచారం అందుకున్న అన్నం సంస్థ మృతుడికి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించింది.
ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం మండలానికి చెందిన ఓ వృద్ధుడు ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఆ వృద్ధుడి అంత్యక్రియలు నిర్వహించడానికి కుటుంబీకులు ఎవరూ ముందుకు రాలేదు. సమాచారం అందుకున్న అన్నం సేవా సంస్థ నిర్వాహకుడు అన్నం శ్రీనివాసరావు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. కొవిడ్-19 నిబంధనలు, జాగ్రత్తలు పాటిస్తూ.. మృతుడి స్వగ్రామంలోని పొలంలో ఖననం చేశారు. ఇప్పటి వరకు కరోనా సోకిన వ్యక్తులు మరణిస్తే.. కనీసం మృతదేహాలు కూడా చూపించకుండా పూడ్చేయడం, మున్సిపాలిటీ వారే దహనం చేయడం జరిగేది. తాజాగా ఖమ్మంలో కరోనా మృతుడికి అంత్యక్రియలు నిర్వహించి ఖననం చేసిన అన్నం సంస్థ శ్రీనివాసరావును గ్రామస్తులు అభినందిస్తున్నారు.
ఇదీ చదవండి: మిడతల దాడులను 'ప్రకృతి విపత్తు'గా ప్రకటించాలి: కాంగ్రెస్