ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత లేదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. 2, 3 రోజుల్లో ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్ కొరత తీరుతుందని వెల్లడించారు. కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్‌ను మంత్రి ప్రారంభించారు. కేంద్రం.. మన రాష్ట్రానికి కావాల్సిన ఆక్సిజన్‌ను విశాఖ నుంచి కేటాయించలేదని ఈటల మండిపడ్డారు. 1,300 కిమీ దూరం ఉన్న ఒడిశా నుంచి యుద్ధ విమానాల్లో ఆక్సిజన్ తెప్పిస్తున్నామని పేర్కొన్నారు.
కరోనా లక్షణాలు ఉన్నాయన్న అనుమానం వస్తే నిర్లక్ష్యం చేయొద్దని ఈటల సూచించారు. కరోనా టెస్టులు, రిపోర్టుల కోసం వేచిచూడవద్దని కోరారు. వైద్యుణ్ని సంప్రదించి సరైన చికిత్స చేయించుకోవాలని మంత్రి ఈటల సూచించారు. వైద్యులు సైతం ఫలితాలు కోసం ఆగొద్దని.. చికిత్స ప్రారంభించాలని ఆదేశించారు. నిర్లక్ష్యం కారణంగానే ప్రాణాలు పోతున్నాయన్న ఈటల.. పాజిటివ్ అని తెలిసీ... నిర్లక్ష్యం చేస్తున్నవారే మరణిస్తున్నారన్నారు.
టెస్టు కిట్ల కొరత రాష్ట్రంలో లేదన్న ఈటల రాజేందర్.. జగిత్యాల.. మహారాష్ట్రకు రాకపోకల వల్లే అక్కడ ఎక్కువ కేసుల నమోదవుతున్నాయని అభిప్రాయపడ్డారు.