karimnagar mlc elections 2021: రసవత్తరంగా సాగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఆసక్తికర పరిణామాల మధ్య పోలింగ్ ముగియగా.. 14న వెలువడే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న అంశం చర్చనీయాంశంగా మారింది. పోలింగ్ ప్రక్రియ ముగియగానే.. రవీందర్ సింగ్ సహా అభిమానులు బాణా సంచా కాల్చి సంబురాలు చేసుకోవటం మరింత ఆసక్తికరంగా మారింది.
క్యాంపు రాజకీయాలతో రసవత్తరంగా..
TRS Camp Politics: తెరాస తరఫున ఎల్. రమణ, భానుప్రసాద్‌రావును అధిష్ఠానం బరిలో నిలిపింది. మొత్తంగా 24 మంది నామినేషన్లు వేయగా.. పార్టీ నేతలు అతికష్టం మీద 14 మందిని ఉపసంహరింపజేయగా.. బరిలో 10 మంది నిలిచారు. ఇందులో కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ కూడా ఉన్నారు. తెరాసకు మెజార్టీ ఉన్నా.. సర్దార్ రవీందర్ సింగ్ బరిలో నిలవటం.. మరోవైపు నిఘావర్గాలు హెచ్చరిటంతో.. అధిష్ఠానం ముందు నుంచే జాగ్రత్త పడడం మరింత ఆసక్తికరంగా మారింది. అధిష్ఠానం నిర్ణయాన్ని ధిక్కరించి బరిలో నిలిచిన సర్దార్ రవీందర్‌సింగ్ కారణంగానే గులాబీ పార్టీ క్యాంపు రాజకీయాలకు తెరతీసినట్లు సమాచారం.
ముఖ్య నేతలే నేరుగా మానిటరింగ్..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, మేయర్ సునీల్‌రావు, జిల్లాలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జీలే స్వయంగా వెళ్లి.. ప్రజాప్రతినిధులను మానిటరింగ్ చేశారు. రోజూ సమావేశమవుతూ.. ప్రత్యర్థుల ప్రభావం లేకుండా జాగ్రత్తపడ్డారు. క్యాంపులో ఉన్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపాలిటీల వారిగా లెక్కలు తీసి.. ప్రత్యర్థి వైపు మొగ్గుచూపుతున్నవారిపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. వారి ఓట్లు డైవర్ట్ కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నారు. పోలింగ్ వరకూ క్యాంపుల్లోనే ఉండి.. నేరుగా కేంద్రాలకు వచ్చి నేతలు ఓట్లేశారంటే.. తెరాస అధిష్ఠానం చాలా ఎంత అప్రమత్తంగా ఉందో అర్థమవుతోంది.
ఇద్దరినీ గెలిపించుకునేందుకు..
Training on voting:ఎట్టి పరిస్థితుల్లోనూ తెరాస అభ్యర్థులిద్దరూ గెలవాలని.. క్రాస్ ఓటింగ్ జరగకూడదనే గట్టి పట్టుదలతో తెరాస ప్రణాళికలు అమలుచేసింది. సగం మంది మొదటి ప్రాధాన్యత ఓటును రమణకు, రెండో ప్రాధాన్య ఓటును భానుప్రసాదరావు వేయ్యాలని.. మిగిలిన సగం మంది మొదటి ప్రాధాన్యత ఓటును భానుప్రసాదరావుకు, రెండో ప్రాధాన్యత ఓటును ఎల్.రమణకు వేయాలన్న అంశంపై ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇచ్చారు.
సర్దార్ ప్రభావం పడనుందా..?
మేయర్‌గా చేసిన అనుభవంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న నేతలతో సర్దార్కు వ్యక్తిగత పరిచయాలున్నాయి. అదీ కాకా.. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. తెరాస రెబల్‌గా బరిలో నిలవడంతో సర్దార్కు ప్రత్యర్థి పార్టీల మద్దతు కూడా లభించింది. మరోవైపు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సైతం.. రవీందర్ సింగ్‌కు మద్దతిచ్చారు. ఇన్ని పరిణామాల మధ్య.. ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది తెరాస నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు కచ్చితంగా క్రాస్ ఓటింగ్ చేశారని సర్దార్ రవీందర్ సింగ్ అనుచరులు ధీమా వ్యక్తం చేయటం గమనార్హం. అధికార తెరాస క్రాస్ ఓటింగ్‌ను నివారించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. తన విక్టరీకి తగ్గట్టుగా ఓట్లు పడితీరాయని సర్దార్ విశ్వాసం వ్యక్తం చేయటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
మొదటి నుంచి అధికార పార్టీ తీసుకున్న జాగ్రత్తలు అనుకూల ఫలితాలు ఇస్తాయా..? లేక.. క్యాంపు రాజకీయాల్లో ఎంజాయ్ చేసి.. తెరాస రెబల్కే ఓట్లేసి నేతలు మద్దతు తెలపనున్నారా..? అనేది ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వాదనలన్నింటికీ తెరపడాలంటే.. డిసెంబర్ 14 వరకు వేచిచూడాల్సిందే...!
సంబంధిత కథనాలు..