Telangana National Unity Day Celebrations: భూమి కోసం... భుక్తి కోసం... వెట్టి చాకిరి విముక్తి కోసం... నిజాం సైన్యానికి వ్యతిరేకంగా పోరాడిన హైదరాబాద్ ప్రాంతం భారత యూనియన్‌లో కలిసి... 75వ సంవత్సరంలోకి అడుగుపెడుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా వేడుకలు నిర్వహిస్తోంది. ఏడాదిపాటు నిర్వహిస్తున్న... తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా సాగుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు కన్నులపండువగా సాగాయి. ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర శాసనసభలోని అసెంబ్లీలో సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలిలో ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి జాతీయజెండాను ఎగురవేశారు. అంబేడ్కర్, గాంధీ విగ్రహాలవద్ద నివాళులర్పించారు. వికారాబాద్ జిల్లా పరేడ్ మైదానంలో జాతీయ జెండాను శాసనసభ ఉపసభాపతి పద్మారావుగౌడ్ ఆవిష్కరించారు. రంగారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయఆవరణలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురువేసి పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు.
రాచరికపాలన నుంచి విముక్తి పొంది ప్రజాస్వామ్యం వైపుకి.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వేడుకలు అట్టహాసంగా సాగాయి. సిరిసిల్ల కలెక్టరేట్‌లో జాతీయపతాకాన్ని మంత్రి కేటీఆర్ ఎగురవేసి పోలీసుల నుంచి గౌరవం స్వీకరించారు. అనంతరం స్వాతంత్ర్య సమర యోధుల్ని సన్మానించారు. కరీంనగర్ పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో జాతీయపతాకాన్ని గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. జగిత్యాలలో వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొప్పుల ఈశ్వర్ త్రివర్ణ పతకాన్ని ఎగురవేశారు. 1948 సెప్టెంబర్ 17 న హైదరాబద్ సంస్థానానికి రాచరికపాలనతో విముక్తి కలగడంతో ప్రజాస్వామ్య వ్యవస్థలోకి అడుగుపెట్టామని మంత్రి హరీశ్‌రావు గుర్తుచేశారు. సిద్ధిపేట డిగ్రీ కళాశాల మైదానంలో జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. మువ్వన్నెల జెండాను ఎగురవేసిన మంత్రి... పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. మెదక్ కలెక్టరేట్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.
చరిత్ర కనుమరుగు కాకుండా ఉండేందుకే వేడుకలు.. నిర్మల్ కలెక్టరేట్‌లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అప్పటి చరిత్ర కనుమరుగు కాకుండా ఉండేందుకే జాతీయ సమైక్యతా వేడుకలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో జరిగిన వేడుకలకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ హాజరయ్యారు. నిజామాబాద్ కలెక్టరేట్‌లో జాతీయ సమైక్యతా వేడుకల్లో మంత్రి ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు. కామారెడ్డిలో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి.. మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. మహబూబ్‌నగర్ పరేడ్‌గ్రౌండ్‌లో జాతీయపతాకాన్ని ఎగురవేసి పోలీస్ కవాతు పరిశీలించారు. రాష్ట్రంలో సాగిన పోరాటాలు, అమరవీరుల త్యాగాలను గుర్తుచేసుకున్నారు. గద్వాలలో రాజీవ్ శర్మ, వనపర్తిలో నిరంజన్ రెడ్డి, నాగర్‌కర్నూలులో గువ్వల బాలరాజు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో మంత్రి జగదీశ్‌రెడ్డి జాతీయజెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. నల్గొండలోని పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో త్రివర్ణ పతాకాన్ని శాసనమండలి ఛైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆవిష్కరించారు. జనగామ కలెక్టరేట్‌లో వేడుకలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మహబూబాబాద్ ఎన్టీఆర్ స్డేడియంలో మంత్రి సత్యవతి రాఠోడ్ పాల్గొన్నారు. ఖమ్మం పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ జెండాను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆవిష్కరించారు. వేడకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ఇవీ చదవండి: