తెరాస ప్రభుత్వం వచ్చాక 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు తెలిపారు. రేపో మాపో మరో 50వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేష్ ఇస్తామని ప్రకటించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంటలో మంత్రి పర్యటించారు. స్వయం సహాయక సంఘాలకు రుణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
" ఓవైపు ఆస్తుల కల్పనకు సీఎం కేసీఆర్ కృషి చేస్తుంటే.. మరోవైపు కేంద్రంలోని భాజపా సర్కార్ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతోంది. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా.. కాజీపేట్కు రైల్వే కోచ్ తీసుకురాలేకపోయింది. ఇంత కాలం అధికారంలో ఉన్న మాజీ మంత్రి.. నియోజకవర్గ అభివృద్ధికి ఇసుమంత కూడా కృషి చేయలేదు. తెలంగాణ రాకముందు.. వచ్చాక రాష్ట్రంలో జరిగిన మార్పులు గమనించండి. మీ ఆశీర్వాదం ఉంటే తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. "
- హరీశ్ రావు, రాష్ట్ర ఆర్థిక మంత్రి
మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీరిచ్చామని మంత్రి హరీశ్ అన్నారు. నీటి బాధను తీర్చింది తెలంగాణ సర్కారేనని గుర్తు చేశారు. పల్లెల్లోనూ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. పల్లె ప్రగతితో వినూత్న కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు.
- ఇదీ చదవండి : Bhabanipur Election: దెబ్బతిన్న పులి X ధైర్యవంతురాలు