Kaleshwaram Land Acquisition Survey: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి మండలంలో అదనపు టీఎంసీ కాలువ భూసేకరణ సర్వేలో జాప్యంపై ఆర్డీవో శ్రీనివాస్ సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. విలాసాగర్లో భూసేకరణ సర్వే కోసం వెళ్లిన అధికారులను రైతులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో విలాసాగర్ చేరుకొని అధికారులతో సర్వే తీరును అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న రైతులు తమ అనుమతి లేనిది వ్యవసాయ పొలాల్లోకి రావొద్దని సూచించారు. గ్రామ సభ నిర్వహించి పరిహరంపై స్పష్టత ఇవ్వాలన్నారు. పురుగుల మందు డబ్బాలతో ఆందోళన నిర్వహించారు.
పురుగుల మందు తాగుతానన్న ఆర్డీవో..
పురుగుల మందు తాగుతామని రైతులు పేర్కొనడంతో తాను ప్రభుత్వ ఉద్యోగినని చట్టపరిధిలో పనిచేయాల్సి ఉంటుందని, తనకు పురుగుల మందు ఇవ్వాలని తాగుతానని ఆర్డీవో పేర్కొన్నారు. భూ సేకరణ చేయకుంటే తమదీ అదే పరిస్థితంటూ... రైతులకు ఆర్డీవో వివరణ ఇచ్చారు. చట్టప్రకారం భూసేకరణ జరుగుతుందని రైతులు సహకరించాలన్నారు. భూసేకరణపై గతంలో నోటిఫికేషన్ ఇచ్చినట్లు తెలిపారు. తాను చెప్పిన విధంగా ఎందుకు సర్వే చేయడం లేదని సిబ్బందిని ప్రశ్నించారు. రైతులకు వివరంగా చెప్పి సర్వే చేయాలని ఆదేశించారు.
ఇదీ చదవండి:DRONE SURVEY: డ్రోన్‌తో భూసర్వేకు అధికారుల యత్నం.. అడ్డుకున్న నిర్వాసితులు