జనాభా పెరుగుదలతో ఏర్పడుతున్న ఆక్సిజన్ కొరతను అధిగమించాలంటే మొక్కలు నాటడం ఏకైక మార్గమని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ (Gangula Kamalakar) అన్నారు. కరీంనగర్‌లోని సీతారాంపూర్‌లో మేయర్ సునీల్‌రావుతో కలిసి పట్టణ ప్రగతిలో పాల్గొని మొక్కలు నాటారు. పచ్చదనాన్ని పెంచేందుకు ప్రజలు స్వచ్ఛందంగా హరితహారంలో పాల్గొనాలని సూచించారు.
ఏడో విడత హరితహారంలో 34 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. పట్టణాల్లో పది లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 24 లక్షల మొక్కలు నాటాలని నిర్దేశించారు. ఒక్క కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోనే 5 లక్షల మొక్కలు నాటనున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో దూరదృష్టితో హరిత హారానికి శ్రీకారం చుట్టారని.. ఇప్పటి వరకు ఆరు విడతల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు మంత్రి వివరించారు.
స్మార్ట్ బస్‌బేలు..
కరీంనగర్‌లో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు స్మార్ట్ బస్‌బేలను ఏర్పాటు చేసినట్లు మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్‌లోని సర్కస్ గ్రౌండ్ వద్ద ప్రైవేటు సంస్థ భాగస్వామ్యంతో రెండు ఏసీ బస్‌బేలను మేయర్ సునీల్‌రావు, కలెక్టర్ శశాంకతో కలిసి ప్రారంభించారు.
నగరంలోని వివిధ రూట్లలో ఆర్టీసీ బస్సులు రోడ్లపైనే ఆగడం వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోందని మంత్రి పేర్కొన్నారు. అందువల్లనే ప్రణాళికబద్ధంగా నగరంలోని సదుపాయాల మెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తొలివిడతలో సర్కస్ గ్రౌండ్ వద్ద బస్‌బేలు ఏర్పాటు చేశామని.. త్వరలో వివిధ మార్గాట్లో వీటిని ఏర్పాటుచేయబోతున్నట్లు తెలిపారు. ఐటీ హబ్, మానేరు రివర్ ఫ్రంట్ వల్ల పెట్టుబడిదారులు రావడమే కాకుండా ఉద్యోగావకాశాలు పెరుగుతాయన్నారు.
తీగల వంతెన...
నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తీగల వంతెన అప్రోచ్ రోడ్డు కోసం భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి గంగుల అన్నారు. తీగల వంతెన పనులు పూర్తయినా.. అప్రోచ్ రోడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉందన్నారు. పరిహారం పెంచాలని భూముల యజమానులు కోరుతున్న మాట వాస్తవమేనన్నారు. ఈ విషయం సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. అప్రోచ్ రోడ్డు కోసం స్వయంగా తన భూమినే కోల్పోతున్నట్లు మంత్రి చెప్పారు. ప్రస్తుతం పరిహారం తక్కువ వచ్చినా మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణం తర్వాత.. భూముల విలువ గణనీయంగా పెరుగుతుందని.. అందరికీ నచ్చచెబుతున్నట్లు మంత్రి వివరించారు. అవసరమైన భూమికోసం భూసేకరణకు వెళతామన్నారు.
ఇదీచూడండి: Drugs Case: సినీ ప్రముఖుల డ్రగ్స్ కేసును విచారణకు స్వీకరించిన నాంపల్లి కోర్టు