Manthani Excise Office: పెద్దపల్లి జిల్లా మంథనిలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయం అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఇటీవల గోదావరికి వచ్చిన వరదలతో ఈ కార్యాలయం నీట మునిగింది. కొంత ఫర్నీచర్, విలువైన పత్రాలను అధికారులు కాపాడినప్పటికీ.. మరికొంత ఫర్నీచర్, ఇతరత్రా వస్తువులు వరద ధాటికి పూర్తిగా పాడైపోయాయి. దీంతో అధికారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఏడాదికి దాదాపు 15 కోట్ల ఆదాయం గడిస్తున్నా కార్యాలయానికి ఇప్పటివరకూ సొంతభవనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మంథనిలో అద్దె భవనం దొరకకపోవడంతో 2కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్లేపల్లిలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మంథని-కాటారం ప్రధాన రహదారికి ఆనుకొని నాలుగు సంవత్సరాల క్రితం 9 గుంటల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించినా ఇప్పటివరకు బడ్జెట్ కేటాయించకపోవడంతో నిర్మాణం ప్రారంభం కాలేదు. ఈ స్థలంపై అక్రమార్కుల కన్ను పడి కొంతమేర కబ్జాకు గురైంది.
మంథని ఎక్సైజ్ కార్యాలయం పరిధిలో నాలుగు మండలాలు, 70 గ్రామాలు ఉన్నాయి. ముత్తారం, కమాన్పూర్, రామగిరి, మంథని మండలాలు ఈ కార్యాలయం పరిధిలో పనిచేస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్నప్పుడు కాటారం మండలం కూడా ఈ కార్యాలయం పరిధిలోనే ఉండేది. ఒక సీఐ, ఎస్సై,12 మంది కానిస్టేబుళ్లు, ఒక క్లర్క్ మొత్తం 15 మంది సిబ్బంది ఈ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. సొంత భవనం లేకపోవడం వల్ల అద్దె భవనంలోనే కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.
ఈ భవనం చాలా సంవత్సరాల క్రితం నిర్మించడం వల్ల ఎప్పుడు కూలిపోతుందో అన్నట్లుగా ఉంది. రెవెన్యూ పరంగా సంవత్సరానికి రూ. 15 కోట్ల ఆదాయం అందిస్తుంది. 15 వైన్స్ షాపులు, ఒక బార్ మంథని రెవెన్యూ ఎక్సైజ్ పరిధిలో నిర్వహిస్తున్నారు. ఎక్సైజ్ సిబ్బంది అద్దె వాహనంలోనే విధి నిర్వహణ కొనసాగిస్తున్నారు. మంథని ఎక్సైజ్ పరిధిలో గుడుంబా రవాణా, అక్రమ బెల్లం మొదలైనవి అనేక సందర్భాల్లో పట్టుబడ్డాయి. అనేకసార్లు వాహనాలనూ వేలం పాట వేశారు.
ఇవీ చదవండి: