ఇది కరీంనగర్‌లోని కార్ఖానగడ్డలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల. జిల్లాలో ఎక్కువ విద్యార్థులు(482) గల పాఠశాలల్లో ఇది రెండోది. ఆంగ్లమాధ్యమంలో 6-10, తెలుగు మాధ్యమంలో 8-10 తరగతులున్నాయి. ఆంగ్లమాధ్యమంలో ఒక్కో తరగతిలో రెండు సెక్షన్లు ఏర్పాటు చేశారు. బోధన కోసం 13 తరగతి గదులు అవసరముండగా, ప్రస్తుతం 8 గదులు మాత్రమే అందుబాటులోని ఉన్నాయి. వరండాలు, చెట్ల కింద బోధనే కొన్ని తరగతులకు జరుగుతోంది. కొవిడ్ నిబంధనలను అమలు చేస్తూ విద్యార్థులను కూర్చోపెట్టే పరిస్థితి లేదు.
అసలే గదుల కొరత..ఆపై...!
జిల్లాలోని మెజారిటీ ప్రభుత్వ పాఠశాలల్లో గత కొన్నేళ్లుగా గదుల కొరత ప్రధాన సమస్యగా మారింది. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 651 ఉండగా, గత విద్యాసంవత్సరం యు-డైస్ ప్రకారం మొత్తం 34,923 మంది విద్యార్థులు చదువుతున్నారు. 2018 నుంచి పాఠశాలల్లో మేజర్ మరమ్మతులు, గదుల నిర్మాణాలకు ప్రభుత్వ పరంగా నిధులు రావడం లేదు. ఫలితంగా మరమ్మతులకు నోచని గదులు శిథిలావస్థలోకి చేరుకుంటున్నాయి. మెజార్టీ పాఠశాలల్లో పెచ్చులూడుతున్న పైకప్పులు, కూలేందుకు సిద్ధంగా ఉన్న గదులతో విద్యార్థులు కూర్చుండేందుకు ఇక్కట్లు పడుతున్నారు. చాలా వాటిల్లో వరండాలు, చెట్ల కింద చదువులను వెళ్లదీస్తున్నారు.
సమస్య జటిలం.. ప్రత్యామ్నాయంపై ఆశలు
ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైతే కొవిడ్ నిబంధనలను అమలు పర్చాల్సి ఉంటుంది. భౌతిక దూరం పాటించడం, అదే పద్ధతిలో విద్యార్థులను కూర్చుండబెట్టి, మాస్కులు ధరించడం, శానిటైజేషన్ చేయడం వంటి వాటితో బడులు కరోనాకు దూరంగా నిలిచే అవకాశముందని ఉపాధ్యాయులు భావిస్తున్నారు. గదులు తక్కువగా ఉండి విద్యార్థులు ఎక్కువగా ఉన్న చోట కొవిడ్ నిబంధనల అమలు ఉపాధ్యాయులకు పరీక్షగా మారనుంది. జిల్లాలో ఇలాంటి సమస్య గల పాఠశాలలు చాలా మేరకు ఉన్నాయి. షిఫ్టుపద్ధతి, రోజు తప్పించి రోజు తరగతుల వారీగా బోధన సాగిస్తే ఈ సమస్య పరిష్కారమయ్యే అవకాశముందని జిల్లాలోని పలువురు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈదిశగా ఆలోచించాలని వారు కోరుతున్నారు.
● ఇది గంగాధర మండలం బూర్గుపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. ఇందులో ఆంగ్లమాధ్యమంలో బోధన సాగుతుండగా, 179 మంది బాలలు ఉన్నారు. 3-5 తరగతులు రెండేసి సెక్షన్లలో నడుస్తున్నాయి. ప్రస్తుతం 5 గదులు ఉండగా, అదనంగా మరో 3 గదులు అవసరమున్నాయి. గదుల కొరతతో విద్యార్థులకు కూర్చుండబెడుతున్నారు. ఇందులో ఒక గదిలో అంగన్‌వాడీ కేంద్రం ఉంది.
ఇది కరీంనగర్ రూరల్ మండలం నగునూర్‌లోని జడ్పీ ఉన్నత పాఠశాల. ప్రస్తుతం ఆంగ్ల మాధ్యమంలో 380 మంది బాలలు ఉన్నారు. ఆంగ్లమాధ్యమంలో అన్ని తరగతుల్లో రెండేసి సెక్షన్లు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఏడు తరగతి గదులు సాధారణ రోజుల్లోనే సరిపోని పరిస్థితి నెలకొంది.
ఇదీ చూడండి: SABITHA INDRA REDDY: విద్యా సంస్థల ప్రారంభానికి ఇదే సరైన సమయం