KodiPunju : మీరు జంబలకిడిపంబ సినిమా చూశారా..! ఆ సినిమాలో ఓ ద్రావణం కలిపిన నీళ్లు తాగగానే మగవాళ్లు.. ఆడవాళ్లలా, ఆడవారు.. మగవారిలా మారతారు. వారి వేషధారణ, ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. అలా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఓ కోడిపెట్ట.. పుంజులా కూత పెడుతోంది. కోడిపెట్ట.. పుంజులా కూత పెట్టడమేంటి అనుకుంటున్నారా. నిజమేనండి.. అసలు అలా ఎలా జరిగిందంటే..?
Kodipetta As KodiPunju :ఓ కోడిపెట్ట పుంజు మాదిరిగా కూత పెడుతున్న విచిత్రమిది..కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని గాంధీనగర్‌లో నివాసముంటున్న విద్యుత్తు సంస్థ లైన్‌మెన్ మాడ్గుల ఆనందం ఆర్నెళ్ల కిందట ఓ నాటు కోడిపెట్టను కొన్నాడు. అది 12 గుడ్లు పెట్టి పొదిగింది. ఇపుడు దానికి పది పిల్లలు. నెలరోజుల నుంచి దాని తలపై పుంజులాగే కొంచెం జుట్టు పెరిగింది. పైగా పుంజులా కూత కూడా పెడుతుండడంతో యజమాని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పశుసంవర్థక శాఖ జిల్లా అధికారి డాక్టర్ జయరాములును వివరణ కోరగా కోడిపెట్టలో ఫిమేల్ హార్మోన్లు తగ్గి మేల్ హర్మోన్లు పెరగడం వల్ల ఇలాంటి మార్పులు వచ్చి పుంజులా కూత పెడుతుందని వివరించారు. చాలా అరుదుగా ఇలాంటి మార్పులు వస్తాయని చెప్పారు.