రాష్ట్ర స్థాయిలో అత్యధిక కేసులు నమోదవుతున్న నగరాల్లో కరీంనగర్ కార్పొరేషన్ చేరింది. తొలినాళ్లలో స్వీయ నియంత్రణకు తోడు పోలీసులు, అధికారుల చర్యలతో కరోనా కట్టడిలో నంబర్ వన్‌గా నిలిచింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాకుండా.. కాలనీల్లో సంచరించకుండా డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసి సఫలమయ్యారు. ఎక్కడికక్కడ కంటైన్మెంట్ జోన్లను పక్కాగా నిర్వహించారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. యంత్రాంగం కొంతమేర తమవంతు బాధ్యత కనబర్చినా.. వ్యక్తిగత జాగ్రత్తల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇష్టానుసారంగా వేడుకల్ని నిర్వహించుకుంటున్నారు. సమూహాలుగా సంచరిస్తున్నారు. మాస్కుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. హోమ్ క్వారెంటైన్‌లో ఉండాల్సిన వాళ్లు.. ఐసోలేషన్ గడువుకు ముందే రోడ్లకిపై తిరుగుతున్నారు. ఫలితంగా కరీంనగర్‌లో కరోనా కేసులు అధికమవుతున్నాయి.
76 శాతం మేర కేసులన్నీ..
జిల్లాలో కొత్తగా 97 కేసులు నమోదు కాగా అందులో అధిక శాతం కరీంనగర్ నగరంలోనే ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1,314మందికి వైరస్ సోకగా.. కొత్త కేసులతో కలిపి ఈ సంఖ్య 1,411 కు చేరింది. అందులో సుమారుగా 76 శాతం మేర కేసులన్నీ కరీంనగర్ పట్టణంలోనే నమోదవడం స్థానికులను కలవరపెడుతోంది. ఇప్పటి వరకు నగరంలోనే సుమారు వెయ్యి వరకు కేసులు నిర్ధరణ అయ్యాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. సుమారు 4లక్షలకుపైగా జనాభా ఉన్న నగరంలో దాదాపుగా 45కిపైగా డివిజన్లలో కేసుల మూలాలు బయటపడ్డాయి. నగరవ్యాప్తంగా 65 వరకు కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటన తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి.
ఎలాంటి సాయం అందడం లేదు..
ఒక్కో డివిజన్‌లో కుటుంబాలకు కుటుంబాలే వైరస్ బారిన పడి అవస్థల్ని ఎదుర్కొంటున్నాయి. పరీక్ష చేయించుకుంటే పాజిటివ్ వచ్చిందనే సమాచారం తప్ప.. వైద్య ఆరోగ్యశాఖ నుంచి ఎలాంటి సాయం అందడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో కాలనీల్లో పదుల సంఖ్యలో కేసులు బయటపడటం... వారంతా హోంఐసోలేషన్‌లో ఉంటుండటంతో ఇరుగు పొరుగు ఆందోళన చెందుతున్నారు.
ఇవీ చూడండి: నూతన విద్యా విధానం: బంగరు భవితకు నారుమడి!