కరీంనగర్ ప్రధాన రహదారుల పనులు స్మార్ట్‌సిటీ నిధులతో వేగంగా జరుగుతున్నాయి. కాలనీల్లో మాత్రం పరిస్థితి అధ్వానంగా మారింది. సరైన మురుగు కాల్వలు, రోడ్డు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భారీవర్షాలకు వరద.. ఇళ్లలోకి చేరుతోంది. ఇంటికి చేరేందుకు జనం సర్కస్ ఫీట్లు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. పిల్లలు, వృద్ధులు ప్రమాదాల భారినపడతారేమో అని ఆందోళన చెందుతున్నారు.
విలీన పంచాయతీల దుస్థితి...
ఇటీవల నగరపాలికలో విలీనమైన గ్రామపంచాయతీల్లో పరిస్థితి మరీ దారుణంగా మారింది. అలకాపురి కాలనీ చెరువును తలపిస్తోంది. మురుగునీరు, పిచ్చిమొక్కలు, చెత్తాచెదారంతో దుర్వాసన వెదజల్లుతోంది. దోమలకు ఉత్పత్తి కేంద్రాలుగా మారి సాయంత్రం అయితే చాలు మోత మోగిస్తున్నాయి. గతేడాది డెంగీ, మలేరియా, వైరల్ జ్వరాలతో జనం అవస్థలు పడగా.. కరోనా భయం వల్ల ఏమాత్రం అనారోగ్యంగా ఉన్నా వణికిపోతున్నారు.
నోటీసులతో సరిపెట్టారు...
ఖాళీగా వదిలేసిన స్థలాలు గుర్తించిన నగరపాలక అధికారులు.. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా నోటీసులు జారీ చేశారు. దాదాపు 3వేల మందికి పైగా తాఖీదులు ఇచ్చారు. మరికొన్ని చోట్ల నగరపాలిక సిబ్బంది శుభ్రం చేశారు. నిర్లక్ష్యంగా వదిలేసిన ప్లాట్లకు పట్టణ ప్రణాళిక అధికారులు నోటీసులతో చేతులు దులుపుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏ ప్లాటుకు జరిమానా విధించకపోగా వాననీరు, చెత్తా చెదారం, పిచ్చి మొక్కలతో నిండిపోయినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.
డైనేజీ సౌకర్యం కల్పిస్తేనే...
అలకాపురి, ఆదర్శనగర్, హౌసింగ్‌బోర్డుసహా 30 ప్రాంతాల్లో సమస్య అధికంగా ఉంది. భూగర్భజలాలు పెరిగిన దృష్ట్యా.. వాననీరు భూమిలోకి ఇంకిపోయే పరిస్థితి లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటిని తొలగిస్తున్నా పెద్దగా ప్రయోజనం లేదంటున్నారు. డ్రైనేజీ సదుపాయం కల్పిస్తేనే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని సూచిస్తున్నారు.