మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా.. జగిత్యాల జిల్లాలో సెర్ప్ అధికారులు కృషి చేస్తున్నారు. మహిళా సంఘాల ద్వారా ఆహార ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటుచేస్తూ... "సహజ" బ్రాండ్ పేరుతో మార్కెట్లో విక్రయిస్తున్నారు. అందులో భాగంగా జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్‌లో నూనె మిల్లును ఏర్పాటు చేశారు. 4 లక్షల పెట్టుబడి సాయాన్ని వివిధ మార్గాల ద్వారా అందించి నలుగురు మహిళల ద్వారా యూనిట్‌ను ఏర్పాటు చేశారు. వేరుశనగ నూనె, నువ్వుల నూనెను గానుగ పట్టించి ఇస్తున్నారు. మహిళలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మరింతగా కృషిచేస్తామని అధికారులు చెబుతున్నారు.
లక్ష్మీపూర్ గ్రామంలో నువ్వులు, వేరుశనగ ఎక్కువగా పండిస్తారు. దీంతో మహిళలు నేరుగా రైతుల నుంచే సరుకు కొని నూనె తయారు చేస్తున్నారు. ఎటువంటి కల్తీ లేకపోవడంతో... మార్కెట్ కంటే కాస్త ఎక్కువ ధర ఉన్నా జనం కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం తమ వ్యాపారం బాగా సాగుతోందని ఇదే స్ఫూర్తితో మరింత ముందుకు వెళ్తామని మహిళలు చెబుతున్నారు. స్వచ్ఛమైన నూనె దొరుకుతుండటంతో గ్రామస్థులు గానుగ పట్టిన నూనె కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. నాణ్యమైన నూనె అందిస్తున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి: 'రుతుపవనాల రాక రెండు రోజులు ఆలస్యం'