గత కొన్ని రోజులుగా వాడివేడిగా సాగిన హుజూరాబాద్ ఉపఎన్నిక(Huzurabad by election Polling Arrangements )లో కీలక అంకం ముగిసింది. రాజకీయ పార్టీల ప్రచారాలు, హంగామాలకు తెరపడటంతో.. నేటి నుంచి ఎన్నికల యంత్రాంగం కనుసన్నల్లో నియోజకవర్గం ఉండనుంది. ఉపఎన్నికలో ప్రజలను ప్రలోభాలకు గురిచేసే అంశాలను గుర్తించి వాటికి అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ స్పష్టం చేశారు. స్థానికేతరులు ఎవరూ అక్కడ ఉండకుండా నిఘా విస్తృతం చేయాలని కరీంనగర్, హనుమకొండ జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు తెలిపారు. ఉప ఎన్నిక ఏర్పాట్లపై వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన శశాంక్ గోయల్.. మద్యం, నగదు పంపిణీ జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు..
కొవిడ్ నిబంధనలు అమలు దృష్ట్యా 30న పోలింగ్(Huzurabad by election Polling) సమయాన్ని పెంచుతూ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు నిర్వహించనున్నారు. ఇందుకోసం నియోజకవర్గవ్యాప్తంగా 306 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఇందులో మొత్తం 2లక్షల 37వేల 36 మంది ఓటు హక్కు వినియోగించుకోనుండగా.. వీరిలో పురుషులు లక్షా 17వేల 933 మంది, స్త్రీలు లక్షా 19వేల 102 మంది, ఇతరులు ఒక ఓటరు ఉన్నారు. కొవిడ్ సోకిన వారు సైతం సాయంత్రం సమయంలో ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్న ఈసీ.. వారికి పీపీఈ కిట్లు సమకూర్చనుంది. 28న సాయంత్రం 7 నుంచి 30 తేదీ వరకు డ్రై డే ప్రకటించగా.. మద్యం దుకాణాలు, మద్యం విక్రయించే అన్ని హోటళ్లను మూసివేయాలని ఆదేశించింది. నియోజకవర్గంలో 97 శాతం ఓటర్లకు ఓటర్ స్లిప్పులు పంపిణీ చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రచార గడువు ముగిసినందున.. ఈ సమయంలో ఐదుగురు సభ్యులకు మించకుండా డోర్ టు డోర్ ప్రచారం చేసుకునే అవకాశం కల్పించినట్లు ఆయన వెల్లడించారు.
పటిష్ఠ బందోబస్త్..
పోలింగ్(Huzurabad by election Polling) దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేట్టారు. 3,865 మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందులో 20 కంపెనీల కేంద్ర బలగాలు, 74 మంది ప్రత్యేక పోలీసులు, 700 మంది కరీంనగర్ జిల్లా పోలీసులు, 14వందల 71 మంది ఇతర జిల్లాల పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సామాజిక మాధ్యమాల్లో జరిగే ప్రచారాలను నమ్మకుండా ప్రజలు ప్రశాంత వాతావరణంలో పోలింగ్ పూర్తయ్యేందుకు సహకరించాలని కరీంనగర్ సీపీ సత్యనారాయణ కోరారు.
వెబ్ కాస్టింగ్..
30 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున.. ప్రతి పోలింగ్ కేంద్రంలో 2 ఈవీఎం బ్యాలెట్ యూనిట్లను నెలకొల్పనున్నారు. ఎక్కడైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే అదనంగా అందుబాటులో 279 బ్యాలెట్లను సిద్ధం చేశారు. అన్ని చోట్ల వెబ్ కాస్టింగ్‌తో పోలింగ్ కేంద్రాన్ని రికార్డ్ చేయనుండగా... ఇందుకోసం ఇంజినీరింగ్ విద్యార్థులను ఎంపిక చేసి శిక్షణనిచ్చారు.
టీకా తీసుకున్నవారే విధుల్లో..
ఈ నెల 29 న పోలింగ్ సిబ్బంది పోలింగ్ సామగ్రితో సాయంత్రం వరకు తమకు కేటాయించిన పోలింగ్ కెంద్రాలకు చేరుకుంటారని తెలిపారు. పొలింగ్ సిబ్బంది అందరూ కొవిడ్ రెండు డోసుల టీకా తీసుకున్నవారికి విధులు కేటాయించినట్లు తెలిపారు. పోలింగ్ సందర్భంగా 306 పోలింగ్ స్టేషన్లలో లైవ్ వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.
అధికార యంత్రాంగం పోలింగ్(Huzurabad by election Polling Arrangements ) ఏర్పాట్లలో నిమగ్నమై ఉంటే ఆయా పార్టీలు ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు తమ వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి.