Floods Effect: భారీ వర్షాలకు చిగురుటాకుల్లా వణికిన బడుగుజీవులు తమ నివాసాలు నేలకూలడంతో.. నిలువ నీడ కరవై నానాపాట్లు పడుతున్నారు. పునరావాస కేంద్రాల నుంచి తిరిగి వచ్చిన వారు.. విరిగిపోయిన గోడలు, కూలిన పైకప్పులు చూసి బావురుమంటున్నారు. వెంటనే మరమ్మతులు చేసుకునే స్తోమత లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పిల్లాపాపలతో.. పరాయిపంచనో, సగం కూలిన ఇంట్లోనో తలదాచుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. నష్టపరిహారానికి సంబంధించి రెవెన్యూ అధికారుల సర్వేలు పూర్తయినా, ఇంకా ఎవరికీ సొమ్ము అందలేదు. త్వరలోనే పరిహారం సొమ్ము అందిస్తామని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం తెలిపారు.
ఏ జిల్లాలో ఎన్ని..
పెద్దపల్లి జిల్లాలో 1975 ఇళ్లు దెబ్బతినగా, మంథని నియోజకవర్గంలో 1,838 ఇళ్లు నీటమునిగి గోడలు ధ్వంసమయ్యాయి. జగిత్యాలలో 267, కరీంనగర్ 120, సిరిసిల్లలో 121 ఇళ్లు కూలిపోయాయి.
* ఆదిలాబాద్ జిల్లాలో 67 గృహాలు పూర్తిగా నేలకూలాయి. మంచిర్యాలలో 45, కుమురం భీం జిల్లాలో 95, నిర్మల్‌లో 150 ఇళ్లు ధ్వంసమయ్యాయి. కామారెడ్డి జిల్లాలో 12 ఇళ్లు పూర్తిస్థాయిలో, 304 ఇళ్ల గోడలు దెబ్బతిన్నాయి. నిజామాబాద్‌లో 417 పాక్షికంగా, మరో 11 ఇళ్లు పూర్తిస్థాయిలో పనికిరాకుండా పోయాయి.
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం టి.కొత్తగూడెం, భూపతిరావుపేట, సింగిరెడ్డిపల్లి, చింతలబయ్యారం, రాయిగూడెం ప్రాంతాల్లో 320 ఇళ్లు పూర్తిగా నాశనమయ్యాయి.
* ములుగు జిల్లాలో 31 ఇళ్లు పూర్తిగా కూలిపోగా, మరో 227 గృహాల గోడలు ధ్వంసమయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 58 నేలమట్టమయ్యాయి. 1119 ఇళ్ల గోడలు నేలకూలాయి.
కూలిన ఇంట్లోనే నివాసం.. నా ఇంటి గోడ పూర్తిగా కూలిపోయింది. సంచులు కట్టినా గాలులకు ఎగిరిపోయాయి. గతిలేక ఇదే ఇంట్లో ఉంటున్నాను. వర్షం పడితే నీళ్లు లోపలికి వస్తున్నాయి. గోడ కట్టుకుందామంటే డబ్బులు లేవు. - భూమక్క, శంకరంపల్లి (జయశంకర్ భూపాలపల్లి)
బంధువుల ఇంట్లో తలదాచుకున్నాం.. వర్షాలకు ఇల్లు మొత్తం కూలిపోయింది. ఈ సమయంలో అందరం ఆరుబయట ఉండడంతో ప్రమాదం తప్పింది. నేను, నా భార్య, ఇద్దరు సంతానం.. బంధువుల ఇంటిలో తలదాచుకుంటున్నాం. - దుర్గం శంకర్, ఉల్లిపిట్ట (కుమురం భీం ఆసిఫాబాద్)
ఇవీ చదవండి: