Water Problems: కరీంనగర్ దిగువమానేరు జలాశయంతో నిరంతరాయంగా దిగువకు సరఫరా చేస్తున్న కారణంగా నీరు అడుగంటాయి. పర్యవసానంగా నగరానికి నీటిని సరఫరా చేయడానికి బూస్టర్ల ద్వారా రా వాటర్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇటీవల దిగువ మానేరు జలాశయం గేట్లన్నీ ఎత్తిన క్రమంలో నగరానికి నీటిసరఫరా చేసే పైపు లైన్ దెబ్బతినడంతో ఇప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తోంది. దిగువ మానేరు జలాశయం నుంచి 600 డయామీటర్ల పైప్‌లైన్‌తో పాటు 800 డయామీటర్ల పైప్‌లైన్‌తో రా వాటర్ తీసుకొని శుద్ధి చేసి సరఫరా చేస్తారు. అయితే గేట్లు ఎత్తిన సందర్భంలో బూస్టర్‌తో పాటు 800 డయామీటర్ల పైప్‌లైన్ కొట్టుకు పోయింది. అయితే పైప్‌లైన్ మరమ్మతుల కోసం 25లక్షల రూపాయలతో 2 నెలల క్రితమే టెండర్లు పిలిచినా పనులు మాత్రం ప్రారంభించకపోవడంతో నగరవాసులకు నీరు అందడంలేదు. దీనితో ప్రజలు నగరపాలక సంస్థ తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఒకవైపు నగరంలోని ఎత్తైన ప్రాంతాల్లో సరఫరాలో తీవ్ర అంతరాయం జరుగుతుండగా మిగతా ప్రాంతాల్లోనూ నగరపాలక సంస్థ ఎప్పుడు నీటిని వదులుతారో తెలియని పరిస్థితి నెలకొంది. పూర్తిగా నగరపాలక సంస్థ నీటిపై ఆధారపడి కనీసం బోర్లు కూడా లేని వారి పరిస్థితి దయనీయంగా తయారైంది. నిత్యం ఎదుర్కొంటున్న నీటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పనులు వెంటనే పూర్తి చేయించాలని ప్రజలు కోరుతున్నారు.
"రోజూ వచ్చే నల్లా.. నెల రోజుల నుంచి రావట్లేదు. వచ్చినా.. సన్నటి దారగా వస్తోంది. చాలా ఇబ్బంది అవుతోంది. ప్రతీ ఎండకాలం ఇదే సమస్య వస్తోంది. బయట నుంచి తెచ్చుకుందామన్నా.. ఎక్కడా బోర్లు లేవ్వు. మిషన్ భగీరథ అంటున్నారు. స్మార్ట్ సిటీ అంటున్నారు. కానీ.. మా నీటి సమస్య మాత్రం తీరట్లేదు. అధికారులు ఇప్పటికైనా పరిష్కారం చూపాలి. రోజుకు గంటసేపయినా నీళ్లు వదలాలి." - స్థానిక మహిళలు
మరికొద్ది రోజుల్లోనే సాధారణ స్థితి ఏర్పడుతుందని మేయర్ సునీల్‌రావు తెలిపారు. ప్రస్తుతం పనులు వేగంగా చేపట్టడమే కాకుండా భవిష్యత్తులో పైప్ లైన్ దెబ్బతినకుండా ఉండేందుకు పైప్ లైన్ వైపు ఉన్న గేట్లు ఎత్తవద్దని దిగువమానేరు జలాశయ అధికారులను కోరినట్లు మేయర్ వివరించారు.
"ఎప్పుడు లేనంతగా మానేర్ డ్యాం నిండటం వల్ల.. నీటిని కిందికి వదిలినప్పుడు ఆ ప్రెషర్‌కు దాని కింద ఉన్న పైప్‌లైన్ కొట్టుకుపోయింది. గత రెండు నెలలుగా పైప్‌లైన్ మరమ్మతులు జరుగుతున్నాయి. మరో పది రోజుల్లోనే పనులు పూర్తి చేసి నగరవాసులకు నీటిని అందిస్తాం."
- సునీల్‌రావు, మేయర్
ఇదీ చూడండి: వడ్డీ వ్యాపారుల నడ్డి విరిచేందుకు పోలీసుల చర్యలు..