Dengue Cases in Jagtial: ఇటీవల వర్షాలు... వాతావరణంలో మార్పులతో విష జ్వరాలు ప్రజలను వణికిస్తున్నాయి. సర్కార్ దవాఖానాలో కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటం... అందులో ఎక్కువగా డెంగీ కేసులు నిర్ధారణ అవుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. గత నెల రోజులుగా జిల్లాలో జ్వర పీడితుల సంఖ్య పెద్దఎత్తున పెరిగిపోగా... వీరిలో ఎక్కువగా వైరల్, డెంగీ కేసులు ఉన్నట్లు నిర్ధారణ అయింది.
జిల్లాలో ఇప్పటి వరకు 227 కేసులు నమోదు కాగా... సోమవారం ఒక్క రోజే 50 కేసులు బయటపడ్డాయి. ఇవి ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చిన వారి లెక్కలే కాగా ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరిన వారిలో రోజుకు 50 నుంచి 70 వరకు కేసులు నమోదవుతున్నాయి. జగిత్యాల జిల్లా ఆస్పత్రి అయిన ఎంసీహెచ్ లో రోగులతో మంచాలు పూర్తిగా నిండిపోయాయి. పిల్లల్లోనూ డెంగీ కేసులు నిర్ధారణ అవుతుండగా... చిన్నపిల్లల వార్డులోనూ మంచాలు నిండిపోయాయి.
ప్రభుత్వాస్పత్రి పరిస్థితి ఇలా ఉంటే... ఏ ప్రైవేట్ దవాఖానా చూసినా జ్వరపీడితులతో కిటకిటలాడుతోంది. వైరల్ జ్వరాలతో చాలామందిలో రక్తకణాలు పడిపోతుండటంతో ప్రైవేట్‌లో వేలకు వేలు బిల్లులు వసూలు చేస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. విషజ్వరాలు పెరిగిపోతున్న పరిస్థితుల్లో... ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. పరిసరాల పరిశుభ్రత, దోమల నివారణ కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.
జిల్లాలో జ్వరాలు పెరిగిపోతున్నందున అధికారులు క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వాస్పత్రిలు రోగులతో నిండిపోవటం... ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే స్తోమత లేకపోవటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని గ్రామాలవారీగా వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి: