Attack On Constable: శిరస్త్రాణం ధరించాలని సూచించిన కానిస్టేబుల్‌పై ఓ యువకుడు దాడి చేశాడు. కరీంనగర్‌లోని కలెక్టరేట్ రోడ్డులో పోలీస్ శాఖకు చెందిన ద్విచక్రవాహనంపై ఓ యువకుడు హెల్మెట్ లేకుండా వెళ్తున్నాడు. అదే సమయంలో మరో వాహనంపై వెళ్తున్న ఓ కానిస్టేబుల్ యువకునితో పాటు ద్విచక్రవాహనం పోలీస్ శాఖకు చెందినదిగా గమనించాడు. హెల్మెట్ ధరించి ఇతరులకు ఆదర్శంగా ఉండాలని యువకునికి కానిస్టేబుల్ సూచించాడు.
ఆపినా ఆగకుండా రచ్చ..
కానిస్టేబుల్ ఇచ్చిన సలహాకు ఆగ్రహించిన యువకుడు కానిస్టేబుల్‌పై దాడికి దిగాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. నడిరోడ్డుపై ఈ ఘటన జరగడంతో అక్కడే ఉన్న స్థానికులు ఇద్దరిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ.. యువకుడు ఎంతమాత్రం ఆగకుండా రోడ్డుపై హల్చల్ చేశాడు. తనతో ఉన్న స్నేహితుడు కూడా వారించినా వినకుండా నానా రచ్చ చేశాడు. వెంటనే ఠాణాకు సమాచారం అందించగా.. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు యువకున్ని అదుపులోకి తీసుకున్నారు.
స్టేషన్‌కు తీసుకెళ్లాక అసలు విషయం..
ఘర్షణ పడినంతసేపు తానెవరో చెప్పని ఆ యువకుడు.. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన తర్వాత తానెవరో సెలవిచ్చాడు. తాను ఓ మహిళా సీఐ కుమారున్నని తెలిపినట్టు సమాచారం. పోలీసు వాహనంపై ప్రయాణిస్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోవచ్చు కదా అన్నందుకు.. దాడి చేయడమేంటని స్థానికులు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేయగా.. ఆ యువకుడు ఓ సీఐ కొడుకని తెలియటంతో ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చూడండి: