NGT notice to quarrys : కరీంనగర్ జిల్లాలో పర్యావరణ కాలుష్యంపై బాధ్యులకు చెన్నై జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) నోటీసులు జారీచేసింది. ఈ జిల్లాలోని క్వారీ, గ్రానైట్ మైనింగ్ కంపెనీలు కాలుష్య నివారణ చర్యలు చేపట్టకపోవడం, రాయల్టీతో పాటు జిల్లా మినరల్ నిధికి చెల్లింపుల ఎగవేతపై హైదరాబాద్‌కు చెందిన పేరాల శేఖర్‌రావు ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జ్యుడిషియల్ సభ్యురాలు జస్టిస్ పుష్ప సత్యనారాయణ, సాంకేతిక సభ్యులు డాక్టర్ కె.సత్యగోపాల్‌తో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపించారు.
‘‘ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 95 గ్రామాల్లో 400 గ్రానైట్ గనులు, 200 స్టోన్ కటింగ్ పరిశ్రమలు, 50 స్టోన్ గ్రావెల్ క్వారీలు నడుస్తున్నాయి. ఇవి నిర్వహిస్తున్న పేలుళ్లతో శబ్ద, వాయు కాలుష్యంతోపాటు భూప్రకంపనలు వస్తున్నాయి. ప్రజలు అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. భూమి, నీటి కాలుష్యంతో 447 గ్రామాల పరిధిలో వ్యవసాయ ఉత్పత్తి తగ్గిపోతోంది. ఈ గ్రామాల్లో పర్యావరణ ప్రభావంపై అధ్యయనం చేయాల్సి ఉన్నా పట్టించుకోవడంలేదు. ముఖ్యంగా సర్వారెడ్డిపల్లి, వద్యారం, నాగులాంపల్లి తదితర పదుల సంఖ్యలో గ్రామాలు కాలుష్య ప్రభావంతో సతమతమవుతున్నాయి. రంగు రాళ్ల అక్రమ రవాణా, మైనింగ్‌కు పాల్పడినందుకు ప్రైవేటు కంపెనీలకు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం రూ.749.66 కోట్ల జరిమానా విధించింది. తెలంగాణ ఏర్పాటయ్యాక జరిమానాను రూ.120 కోట్లకు తగ్గించినా, కొన్ని యూనిట్లు మాత్రమే చెల్లించాయి. జిల్లా మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ నుంచి పర్యావరణ పరిరక్షణకు ఒక్క రూపాయి కూడా వెచ్చించలేదు. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదు’’ అని పిటిషనర్ తరఫు న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్ పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు కరీంనగర్ గ్రానైట్ క్వారీస్ ఓనర్స్ అసోసియేషన్, శ్వేత గ్రానైట్స్ అండ్ శ్వేత ఏజెన్సీస్, శాండియా ఇంటర్నేషనల్ గ్రానైట్స్, అరవింద్ గ్రానైట్స్‌లకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది.
ఇవీ చదవండి :