దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో ఎట్టకేలకు ఆర్జిత సేవలకు మోక్షం లభించనుంది. ఇందుకోసం ఆలయ కార్యాలయంలో ఈఓ కృష్ణ ప్రసాద్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసి అధికారులు, అర్చకులతో కలిసి చర్చించారు. బుధవారం నుంచి ఆలయంలో ఆర్జిత సేవలను చేపట్టేందుకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. కరోనా ప్రభావంతో ఆలయాన్ని మూసివేసిన యంత్రాంగం కొన్ని సడలింపులతో భక్తులకు శీఘ్రదర్శనం కల్పిస్తున్నారు. ప్రభుత్వం లాక్ డౌన్‌ను ఎత్తివేయడంతో 50 శాతం భక్తులను అనుమతించేలా దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా ప్రభావంతో ఆలయ ఆదాయం కోట్లలో పడిపోవడంతో పాటు ఉద్యోగులకు వేతనాలు చెల్లించేందుకు కూడా ఇబ్బందిగా మారింది. ఆలయంలో ప్రధానంగా ఆదాయం ఆర్జిత సేవల ద్వారానే చేకూరుతుంది.
*కరోనా ప్రభావంతో చేజారిన రూ.23.75 కోట్లు
రాజన్న ఆలయమంటేనే కోడెమొక్కులకు నెలవు. కోరిన కోర్కెలు తీరితే కోడెమొక్కులు చెల్లించుకోవడం ఇక్కడ ఆనవాయితీగా ఉంది. ఎక్కువ ఆదాయం కూడా కోడెమొక్కుల ద్వారానే సమకూరుతుంది. కరోనా ప్రభావం తీవ్రరూపం దాల్చడంతో మార్చి 20న ఆలయాన్ని మూసివేశారు. ఆగస్టు 8న కొవిడ్ నిబంధనలతో ఆలయాన్ని తెరచి భక్తులను అనుమతించారు. భక్తులకు కేవలం శీఘ్రదర్శనం మాత్రమే అమలు పరిచారు. మార్చి నుంచి సెప్టెంబర్ వరకు ఆలయంలో కరోనా ప్రభావంతో వివిధ విభాగాల నుంచి అందే ఆదాయాన్ని భారీగా చేజారినట్లు ఆలయ యంత్రాంగం గత సంవత్సరం ఆదాయంతో పోల్చగా రూ.28.75 కోట్ల ఆదాయం నష్టపోయినట్లుగా లెక్కలు దేవాదాయశాఖ అధికారులకు అందించారు.
ఆర్జిత సేవల్లో కోడెమొక్కులు, మహాలింగార్చన, స్వామివార్ల కల్యాణం, పల్లకి సేవ, మహాపూజ, ఆకులపూజ, రుద్రాభిషేకము, అన్నపూజ, కుంకుమపూజ, శ్రీ సత్యనారాయణ వ్రతం, ఛండీహోమంలు ఉన్నాయి. ఆన్ లైన్ లోనూ పూజలను మీ సేవ, టీఆప్ ఫోలియో ద్వారా బుక్ చేసుకునే అవకాశముంది. ఆలయంలో ఇప్పటివరకు ఆన్‌లైన్లో 1136 మంది భక్తులు పూజలు వినియోగించుకోగా, ఆదాయం రూ. 5.78లక్షలు అందింది. ఇక నుంచి నేరుగా భక్తులు ఆర్జిత సేవలు పొందే అవకాశముంది.
*అభిషేకాలు, అన్నపూజలు లేవు..
గర్భాలయంలో చేపట్టాల్సిన రుద్రాభిషేకం, అన్నపూజలు, కుంకుమ పూజలు ప్రస్తుతానికి అనుమతించడం లేదు. తలనీలాల సమర్పణ, ధర్మగుండంలో భక్తులక స్నానాలు అనుమతించడంలేదు. వసతిగదులు కూడా యాభైశాతం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు.