కొవిడ్ ప్రభావంతో ఏప్రిల్, మే నెలల్లో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగడంతో వాహన తనిఖీలు పూర్తిగా ఆగిపోయాయి. ఆ రెండు నెలలు నిత్యావసర సరుకులు మినహా వేరే వస్తువులు ఏవి కూడా రవాణా అయ్యేవి కావు. దీంతో అప్పట్లో సరుకులు రవాణా చేస్తున్న వారిలో ఎక్కువ భాగం వే బిల్లులు లేకుండానే కొనసాగించారు. లాక్‌డౌన్ నిబంధనలను సడలించడంతో జూన్ నుంచి పూర్తి స్థాయి సరుకుల రవాణా మొదలైంది. ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి, మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు సరుకులు రవాణా జోరుగా సాగుతోంది.
క్షేత స్థాయిలో అమలు కావడం లేదు
జూన్ నెలలోనే భారీ ఎత్తున జీరో వ్యాపారం కొనసాగుతున్నట్లు వాణిజ్య పన్నుల ఉన్నతాధికారులు గుర్తించారు. దానిని నియంత్రించేందుకు వీలుగా ఒక్కో వాణిజ్య పన్నుల శాఖ డివిజన్‌కు రెండు లెక్కన రాష్ట్రంలోని 12 డివిజన్ల పరిధిలో 24 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తూ వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ సర్క్యులర్ కూడా ఇచ్చారు. ఈ బృందాలు 12 గంటల లెక్కన 24 గంటలు తనిఖీలు నిర్వహించాల్సి ఉంది. కానీ క్షేత్ర స్థాయిలో కమిషనర్ ఆదేశాలు పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. రోజు రోజుకు రాష్ట్రంలో కరోనా కేసులు అధికం అవుతుండడం, ఇప్పటికే వాణిజ్య పన్నుల శాఖలో కొందరికి కరోనా పాజిటివ్ రావడం, ఓ ఉద్యోగి చనిపోవడం లాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో వాహన తనిఖీలకు అధికారులుకాని, సిబ్బందికాని చొరవ చూపడం లేదు.
ఇదే అదనుగా
రాష్ట్రానికి బయట రాష్ట్రాల నుంచి దిగుమతి అయ్యే వాటిలో ఎక్కువగా ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణ వస్తువులు, నిర్మాణ రంగానికి చెందిన టైల్స్, గ్రానైట్, మార్బుల్స్, ఫ్లైవుడ్, శానిటరీ పరికరాలు ఉంటాయి. దిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల నుంచి ఇవి ఎక్కువగా రాష్ట్రానికి రవాణా అవుతుంటాయి. సాధారణంగా ఒక వస్తువు ఒక చోట నుంచి మరొక చోటకు రవాణా అయ్యిందనేందుకు ఈ వే బిల్లు వాడాల్సి ఉంది. రూ.50వేలు అంతకు మించి విలువ సరుకు రవాణాకు ఈ వే బిల్లు వాడకం తప్పనిసరి. వాహన తనిఖీలు నిర్వహించినప్పుడు ప్రధానంగా వే బిల్లులు చూస్తారు... అందులో పేర్కొన్న ప్రకారం సరుకు ఉందా లేదా అన్నది పరిశీలిస్తారు. కానీ వాహన తనిఖీలు జరగకపోవడంతో ఇదే అదనుగా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. వే బిల్లులు ఉంటే... సరకు ఏంటి, దాని పరిమాణం, విలువు ఎంత, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది తదితర వివరాలు ఉంటాయి. వాటి ద్వారానే జీఎస్టీ వసూలు ఉంటుంది.
ప్రభుత్వాదాయానికి గండి
అదే వే బిల్లులు లేకుంటే వ్యాపార లావాదేవీలు జరిగినా జరగనట్లే లెక్క. వే బిల్లులు లేకుండా సరకు రవాణా అయ్యినట్లు ఏలాంటి ఆధారం ఉండదు. దీంతో ప్రభుత్వానికి రావల్సిన రాబడి రాదు. కొందరు అక్రమార్కులు వే బిల్లులు వాడకుండానే సరుకులు రవాణా చేస్తూ జీరో వ్యాపారానికి తెరలేపి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. రాష్ట్రంలో జరిగే వ్యాపార లావాదేవీలతో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెలా రెండువేలకుపైగా జీఎస్టీ రాబడి వస్తుంది. కానీ రాష్ట్రంలో యథేచ్ఛగా కొనసాగుతున్న అక్రమ రవాణా ద్వారా జరుగుతున్న జీరో వ్యాపారంతో రాష్ట్ర ప్రభుత్వానికి నెలకు 400 నుంచి 500 కోట్ల రూపాయలు గండి పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.