హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి వేళల్లో కొంత మంది యువకులు వికృత చేష్టలు చేస్తున్నారు. బైక్‌లపై స్టంట్లు(Bike stunts in Hyderabad) చేస్తూ వాహనదారులను భయపెడుతున్నారు. ఇష్టారీతిన బైక్ డ్రైవ్ చేస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. స్టంట్లు చేసేటప్పుడు ఫోన్లో చిత్రీకరిస్తూ నిర్లక్ష్యం వహిస్తున్నారు.
సోమవారం అర్ధరాత్రి.. ఫ్లోర్ మిల్ నుంచి లంగర్‌హౌస్ వెళ్లే దారిలో యువకులు బైక్‌పై వెళ్తూ విన్యాసాలు చేశారు. ఎదురుగా వచ్చే వాహనదారులను భయపెడుతూ ఇబ్బందులకు గురి చేశారు. ఈ చేష్టలను మరో ద్విచక్రవాహనంపై వెళ్తున్న యువకులు ఫోన్లో చిత్రీకరించారు. బైక్‌పై ఇద్దరు యువకులు కూర్చొని వాహనం ముందు భాగాన్ని ప్రమాదకరంగా గాల్లో లేపి స్టంట్లు(Bike stunts in Hyderabad) చేశారు. బండి కాస్త గాడి తప్పినా.. ప్రాణాలు పోయేవి. ఇప్పటికే ప్రతిరోజు నగరంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది యువత ప్రాణాలు కోల్పోతున్నారు.
బైక్‌లపై స్టంట్లు చేస్తూ వారి ప్రాణాలకు ప్రమాదకరంగా ప్రవర్తించడమే గాక.. ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నారు. ఇలాంటి వారిపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. అర్ధరాత్రి వేళలో పెట్రోలింగ్ చేస్తూ వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.