కరోనా మహమ్మారి ఊపిరి తీస్తోంది. బంధాలను కబళిస్తోంది. బిడ్డలకు కన్నవాళ్లని దూరం చేస్తూ.. తల్లిదండ్రులకు కన్నబిడ్డల్ని దూరం చేస్తూ తీరని శోకం మిగులుస్తోంది. వైరస్ సోకిన ఓ వ్యక్తి తనని ఎలాగైనా బతికించండి అంటూ.. తాను లేకపోతే పిల్లలు అనాథలవుతారని.. తల్లిదండ్రులు తట్టుకోలేరని పదేపదే వేడుకుని చివరికి ఓడిపోయాడు.
హైదరాబాద్ మల్లాపూర్ డివిజన్‌లోని నాగలక్ష్మీనగర్‌కు చెందిన ఆ యువకుడు ఈనెల 13న దగ్గు లక్షణాలతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తీవ్రత లేకపోవడంతో వైద్యుల సూచన మేరకు ఇంట్లోనే ఐసొలేషన్‌లో ఉన్నాడు. ఉన్నట్టుండి బుధవారం మధ్యాహ్నం ఊపిరి తీసుకోవడం కష్టమైంది. దీంతో తార్నాకలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. అక్కడ శుక్రవారం మధ్యాహ్నం వరకూ చికిత్స అందించిన వైద్యులు బాధితుడికి ఆక్సిజన్ ఎక్కువగా అవసరమవుతోందని.. ఇక్కడ నిల్వలు లేవని ఎల్బీనగర్‌లోని మరో ఆసుపత్రికి సిఫార్సు చేశారు. అక్కడా ఆక్సిజన్ కొరత ఉందని చెప్పారు. అప్పటికే సమయం మించిపోతోంది.. ఎలాగైనా బతికించాలంటూ అతడు ప్రాధేయపడడంతో మిత్రులు ఎంతో తాపత్రయపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే ద్వారా గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. అయినా లాభంలేకపోయింది. శుక్రవారం రాత్రి అతడు కన్నుమూశాడు. పుట్టుకతోనే దివ్యాంగుడైన ఆ యువకుడికి భార్య, చిన్న వయసున్న ముగ్గురు పిల్లలు ఉన్నారు. శుక్రవారమే అతని పెళ్లిరోజు కావడంతో తల్లిదండ్రులు, భార్యకు చెప్పకుండానే మిత్రులు అంత్యక్రియలు పూర్తి చేయాల్సి రావడం విషాదకరం.