అధికారం, అంగబలంతో ఏపీ పురపాలక ఎన్నికల్లో వైకాపా అప్రతిహత విజయం సాధించింది. అధికార పార్టీకి సహజంగా ఉండే సానుకూలతలు సునాయాస విజయాన్ని సాధించి పెట్టాయి. పురపాలక ఎన్నికల్లో వైకాపాదే పైచేయి అవుతుందని ముందే అనుకున్నట్టే... చాలా చోట్ల ఆ పార్టీ విజయం నల్లేరు మీద నడకలా సాగిపోయింది. రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు తమ గెలుపునకు కీలకమయ్యాయన్న భావన పార్టీ శ్రేణుల్లో బలంగా ఉంది. ఎన్నికల్లో వైకాపా అభ్యర్థుల గెలుపు బాధ్యతను పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్.. మంత్రులు, ఎమ్మెల్యేల భుజస్కంధాలపై ఉంచారు. పార్టీ అభ్యర్థుల్ని కచ్చితంగా గెలిపించి తీరాలన్న బలమైన సంకేతాలు ఉండటంతో వారు సర్వశక్తులూ ఒడ్డారు.
కొన్ని రోజులుగా సొంత జిల్లాల్లో, నియోజకవర్గాల్లో మకాం వేసి... ఎన్నికల వ్యూహాలను అమలు చేశారు. విశాఖ, విజయవాడ, గుంటూరు నగరాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయింది కాబట్టి... ప్రభుత్వంపై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంటుందేమోనన్న భావన ఉండటంతో, మరింత అప్రమత్తతతో గెలుపే లక్ష్యంగా అందుబాటులో ఉన్న అన్ని వనరులన్నీ ఉపయోగించారు. అధికారంలో ఉండటం సహజంగా కలిసొచ్చే అంశంగా పరిశీలకులు చెబుతున్నారు.
జనసేన బోణీ కొట్టింది
మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన జనసేన పార్టీ.. బోణీ కొట్టింది. భాజపాతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీ ఎన్నికల బరిలో దిగింది. ఈ రెండు పార్టీలు కలిసి కూడా అన్ని చోట్లా పోటీ చేయలేదు. రాష్ట్రంలో తమ పార్టీ 320 వార్డుల్లో పోటీ చేసిందని జనసేన పేర్కొంది. 18 వార్డుల్లో విజయం సాధించింది. 10 మున్సిపాలిటీల్లో బోణీ కొట్టింది. ఉభయగోదావరి జిల్లాల్లో పార్టీ ప్రభావం ఉంటుందని భావించినా.. పెద్దగా విజయం సాధించలేదు. అమలాపురంలో 6 వార్డులు గెలుచుకుంది. ఇక్కడ రెండో స్థానంలో నిలిచింది. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో 4 వార్డులు గెలుచుకుంది. మొత్తంగా నగరాల్లో జనసేన 224 డివిజన్లలో పోటీ చేసి 7 చోట్ల గెలుపొందింది. విశాఖపట్నం కార్పొరేషన్‌లో 3 డివిజన్లను గెలుచుకుంది. గుంటూరులో 2 చోట్ల, ఒంగోలు, మచిలీపట్నంలో ఒక్కో డివిజన్‌లో విజయం సాధించింది. ఏఏ స్థానాల్లో ఎన్ని ఓట్లు వచ్చాయో పరిశీలిస్తున్నామని,పార్టీ ప్రభావంపై అంచనా వేసుకుంటామని పార్టీ నాయకులు చెబుతున్నారు.
వామపక్షాలు 6 స్థానాల్లో విజయం
పుర ఎన్నికల్లో వామపక్షాల అభ్యర్థులు 3 వార్డులు, 3 డివిజన్లలో విజయం సాధించారు. సీపీఐ 3 వార్డులు, ఒక డివిజన్‌లో గెలుపొందగా.. సీపీఎం అభ్యర్ధులు రెండు డివిజన్లలో గెలుపొందారు. విశాఖపట్నంలో సీపీఐ, సీపీఎంలు ఒక్కో డివిజన్‌ను కైవసం చేసుకోగా.. విజయవాడలో సీపీఎం ఒక స్థానంలో గెలుపొందింది. రాయలసీమలోని గుంతకల్, తాడిపత్రి, డోన్‌లలో ఒక్కో వార్డులో సీపీఐ విజయం సాధించింది.
తెదేపా నడిపించని స్థా నిక నాయకత్వం
పురపాలక ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం తెదేపా అనూహ్య పరాజయాన్ని చవిచూసింది. 2019 ఎన్నికల్లో పార్టీ మెరుగైన ఫలితాలు సాధించిన చోటా.. ఈసారి ఎదురుగాలి వీచింది. పార్టీకి బలమైన పునాదులు, లక్షల మంది కార్యకర్తలు ఉన్నా, వారిని ముందుండి నడిపించాల్సిన స్థానిక నాయకత్వం చాలాచోట్ల కాడి పడేయడం ప్రతికూలంగా మారింది. అణచివేత, పోలీసు నిర్బంధాలూ దీనికి ప్రధాన కారణమని పార్టీశ్రేణులు చెబుతున్నాయి. ప్రత్యర్థులు ఎక్కడ గేలం వేస్తారోనన్న భయంతో కొన్నిచోట్ల నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యేవరకూ అభ్యర్థుల్ని దాచిపెట్టాల్సి రావడం నాయకుల స్థైర్యాన్ని దెబ్బతీసింది. ఈ ఎన్నికల్లో సత్తా చాటాలన్న ఉద్దేశంతో అధినేత చంద్రబాబు కర్నూలు, విశాఖ, విజయవాడ, గుంటూరుల్లో వప్రచారం చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నా సానుకూల ఫలితాలు రాలేదు. 3 రాజధానులు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వంటి అంశాలపై ప్రజా వ్యతిరేకత తమకు విజయవాడ, గుంటూరు, విశాఖల్లో కలసి వస్తుందనుకున్న పార్టీ నాయకత్వం నమ్మకం వమ్మయింది. అధికార పార్టీ ధనబలం, అంగబలం, పోలీసు అండతో అడుగడుగునా ఎన్నికలను, ఓటర్లను ప్రభావితం చేసిందని, అదే తమ ఓటమికి ప్రధాన కారణమని తెదేపా నాయకులంటున్నారు. ఒత్తిళ్లున్నా నియోజకవర్గ స్థాయిలో నాయకులు గట్టిగా నిలబడితే మెరుగైన ఫలితాలు సాధించగలం అనడానికి తాడిపత్రి, మైదుకూరుల్లోను, కొంతవరకూ నర్సీపట్నం, బొబ్బిలి వంటిచోట్ల వచ్చిన ఫలితాలే నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు.
భాజపా 7 వార్డులు, 1 డివిజన్ సొంతం
మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 7 వార్డుల్లో విజయం సాధించింది. జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగిన భాజపా పట్టున్న చోట అభ్యర్థులను నిలిపింది. ఈ ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేసిందీ అధికారికంగా ప్రకటించలేదు. కొవ్వూరు, హిందూపురం, గూడూరు మున్సిపాలిటీల్లో ఒక్కో వార్డు, ఆళ్లగడ్డ, జమ్మలమడుగు మున్సిపాలిటీల్లో రెండేసి చోట్ల కమలం వికసించింది. కార్పొరేషన్లలో మాత్రం విశాఖపట్నంలోనే ఒక డివిజన్‌లో గెలుచుకుంది.
జనసేనతో కలిసి పోరాటం : సోము వీర్రాజు
జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ట్విటర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. జనసేన, భాజపా కలిసి రాష్ట్రం కోసం పోరాటం కొనసాగిస్తాయని పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయడానికి, అభివృద్ధి, శ్రేయస్సు మార్గంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు తమ కూటమి వేదికగా ఉపయోగపడుతుందని ట్వీట్ చేశారు.
గణనీయమైన ఓట్లు సాధించాం: మాధవ్
ఈ ఎన్నికల్లో భాజపా, జనసేన కూటమి గణనీయమైన ఓట్లు సాధించిందని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పి.మాధవ్ చెప్పారు. అనేక చోట్ల కొద్ది ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యామని అన్నారు. కార్యకర్తలు మంచి పోరాట పటిమ చూపించారని, అధికార పార్టీ నుంచి దౌర్జన్యాలను, దాడులను ఎదుర్కొన్నారని అన్నారు.
వైకాపా క్లీన్‌స్వీప్
పేరు | వార్డులు | ఏకగ్రీవం | విజయం |
తుని | 30 | 15 | 15 |
వెంకటగిరి | 25 | 2 | 22 |
యర్రగుంట్ల | 20 | 13 | 7 |
రాయచోటి | 34 | 31 | 3 |
కనిగిరి | 20 | 7 | 13 |
ధర్మవరం | 40 | 10 | 30 |