YCP Leaders Attack: ఏపీలోని గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం చందవరం గ్రామంలో సామాజిక కార్యకర్త యన్నం రమణారెడ్డిపై కొందరు వైకాపా శ్రేణులు బుధవారం దాడికి పాల్పడ్డారు. ఇటీవల గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి పనులపై ఆర్టీఐ ద్వారా సమాచారం కోరానని రమణారెడ్డి తెలిపారు. ఈ క్రమంలో విచారణ కోసం ప్రభుత్వ అధికారులు గ్రామ సచివాలయం వద్దకు రమ్మన్నారని వివరించారు. సచివాలయం వద్దకు చేరుకున్న తనపై ప్రత్యర్థులైన వైకాపా నాయకులు కొందరు దాడి చేసి పత్రాలు లాక్కెళ్లారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.
తనపై దాడి చేసిన వారిలో సర్పంచ్ మస్తాన్ వలి, గొంటు విజయ్ భాస్కర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ గొంటు శ్రీనివాసరెడ్డి, చేరెడ్డి వెంకట్ రామిరెడ్డి, అంకిరెడ్డిలు ఉన్నారని బాధితుడు వెల్లడించారు. సచివాలయం వద్ద ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శి సమక్షంలోనే తనపై దాడి జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. గ్రామంలో కుళాయిలు, సీసీ రోడ్లలో జరిగిన కోట్ల రూపాయల పనులలో వైకాపా నాయకులు అవినీతికి పాల్పడ్డారని అధికారులు విచారిస్తే.. అవన్నీ బయటకు వస్తాయనే తనపై వారు దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:YS Sharmila Padayatra: 'సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడమే వైఎస్సార్టీపీ లక్ష్యం'