Doctors on KCR Health: గత రెండ్రోజులుగా అలసిపోయినట్లు, ఎడమ చేయి నొప్పి ఉందని సీఎం కేసీఆర్ చెప్పారని యశోద ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. సాధారణ పరీక్షల్లో భాగంగానే సీఎంకు టెస్టులు చేసినట్లు స్పష్టం చేశారు. పర్యటన, ఉపాన్యాసాలు చేయడం వల్ల నీరసంగా ఉన్నారని వైద్యులు వివరించారు. సర్వైకల్ స్పైన్ వల్ల నరంపై ఒత్తిడి పడి చేయినొప్పి వచ్చినట్లు నిర్ధారణ అయిందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గుండె పనితీరు బాగానే ఉందని పరీక్షల్లో తేలిందని వైద్యులు తెలిపారు. యాంజియోగ్రామ్ నిర్వహిస్తే బ్లాక్‌లు లేవని తెలిసిందని పేర్కొన్నారు. గుండెకు సంబంధించి ఈసీజీ, 2డీ ఇకో పరీక్షల్లోనూ సాధారణంగా ఉన్నట్లు తేలిందన్నారు. బీపీ, షుగర్ నార్మల్‌గా ఉందని పేర్కొన్నారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు వైద్యులు వెల్లడించారు.
"ఎడమ చేతివైపు నొప్పి అని సీఎం కేసీఆర్ చెప్పారు. యాంజియోగ్రామ్ పరీక్షలు చేశాం. బ్లాక్స్ ఏం లేవు. ఆ ఫలితాలతో గుండె సంబంధిత సమస్యలు ఏంలేవని నిర్ధరించాం. గుండె పనితీరును తెలుసుకొనేందుకు కొన్నిపరీక్షలు చేశాం. ఫలితాలు నార్మల్ అని వచ్చాయి. ఎడమ చేతి నొప్పి ఎందుకు వస్తోందో తెలుసుకునేందుకు ఎంఆర్ఐ పరీక్షలు చేశాం. ఏం సమస్య లేదని తెలిసింది. వార్తా పరీక్షలు, ఐపాడ్ ఎక్కువగా చూస్తుండడం వల్లే ఎడమ చేతి నొప్పి వస్తుందని అభిప్రాయపడుతున్నాం. సీఎం కేసీఆర్‌కు బీపీ, షుగర్ ఉన్నాయి. ఆ రెండూ నార్మల్గానే ఉన్నాయి. పర్యటనల వల్ల కొంచెం అలసిపోయారు. వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించాం."
- యశోద ఆస్పత్రి వైద్యులు
ఈ ఉదయం ఆస్పత్రికి..
ఈ ఉదయం సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వైద్య పరీక్షల కోసం యశోద ఆస్పత్రికి వెళ్లారు. కేసీఆర్ వెంట ఆయన సతీమణి, కుమార్తె, మనుమడు, ఎంపీ సంతోష్ ఉన్నారు. వైద్యులు కేసీఆర్‌కు పలు పరీక్షలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న మంత్రులు కేటీఆర్, హరీశ్ సైతం.. సోమాజిగూడ యశోద ఆస్పత్రికి వెళ్లారు. కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వైద్య పరీక్షలు ముగియగా.. ఆస్పత్రి నుంచి ప్రగతి భవన్కు వెళ్లిపోయారు. అస్వస్థత కారణంగా నేటి యాదాద్రి పర్యటనను సీఎం రద్దు చేసుకున్నారు. ఇటీవల దిల్లీలో కూడా కేసీఆర్ వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
ఇదీచూడండి: KCR Hospitalised: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అస్వస్థత