భారత్, పాక్ మధ్య మ్యాచ్ అంటే మమూలుగా ఉండదు. ముఖ్యంగా ప్రపంచకప్‌ల్లో ఈ దాయాది జట్లు తలపడే ఆ మ్యాచ్‌లకు ఫుల్‌క్రేజ్ ఉంటుంది. ఆటలో పైచేయి సాధించడానికి రెండు జట్లూ శాయశక్తులా పోరాడుతారు. ఈ క్రమంలో కొన్ని సందర్భాల్లో క్రికెటర్ల మధ్య గొడవలూ జరిగిన ఉదంతాలు ఉన్నాయి. అయితే, ప్రస్తుతం న్యూజిలాండ్‌లో జరుగుతున్న ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఆదివారం భారత్, పాక్ జట్లు తలపడ్డాయి. టీమ్‌ఇండియా విజయం కూడా సాధించింది. ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది.
పాకిస్థాన్ కెప్టెన్ బిస్మా మరూఫ్‌కు ఆరునెలల చిన్నారి ఫాతిమా ఉంది. బిస్మా ఓ వైపు తన చిన్నారి ఆలనాపాలనా చూసుకుంటూనే మరోవైపు ప్రపంచకప్‌లో జట్టును నడిపిస్తోంది. అయితే, భారత్, పాక్ మ్యాచ్ అనంతరం టీమ్‌ఇండియా క్రికెటర్లు పాకిస్థాన్ జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి కాసేపు సరదాగా గడిపారు. అదే సమయంలో బిస్మా మరూఫ్ తన కుమార్తెను భుజాలపై ఎత్తుకున్న వేళ భారత క్రికెటర్లు సైతం ప్రేమగా ఆ చిన్నారితో ఆడుకున్నారు. తర్వాత ఆ చిన్నారి, బిస్మాతో కలిసి సెల్ఫీలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియోలు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఐసీసీ సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకొని.. ‘భారత్, పాక్ మధ్య జరిగిన మ్యాచ్ నుంచి లిటిల్ ఫాతిమాకు మొదటి క్రీడాస్పూర్తి పాఠం’ అని వ్యాఖ్యానం జోడించింది. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ సైతం ఈ ఫోటోను చూసి సంతోషం వ్యక్తం చేశాడు. తన ఫేస్‌బుక్‌లో ఆ ఫొటో షేర్ చేస్తూ.. ‘ఎంతో మధురమైన క్షణం! క్రికెట్‌కు మైదానంలో బౌండరీలు ఉంటాయి. కానీ, మైదానం వెలుపల ఉండవు’ అని పేర్కొన్నాడు. కాగా, నెటిజన్లు సైతం ఇరు జట్లూ ఇలాంటి క్రీడాస్ఫూర్తినే కొనసాగించాలని కామెంట్లు పెడుతుండటం విశేషం.
ఇదిలా ఉండగా.. ఆదివారం జరిగిన పోరులో టీమ్ఇండియా 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన మిథాలీ సేన 7 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. పూజా వస్త్రాకర్ (67; 59 బంతుల్లో 8x4), స్నేహ్ రాణా (53 నాటౌట్; 48 బంతుల్లో 4x4), స్మృతి మంధాన (52; 75 బంతుల్లో 3x4, 1x6) అర్ధ శతకాలతో రాణించారు. అనంతరం ఛేదనకు దిగిన పాక్.. 137 పరుగులకే ఆలౌటైంది. రాజేశ్వరి 4, ఝులన్ గోస్వామి 2, స్నేహ్ రాణా 2 వికెట్లు పడగొట్టారు. మేఘన సింగ్, దీప్తి శర్మ తలో వికెట్ తీశారు.