హైదరాబాద్ నగరాభివృద్ధిలో మహిళల పాత్ర కూడా ఉంది. అవును నిజమే... అటు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌గా ఉన్న సమయంలో రెండు మార్లు... గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్‌గా మారిన తర్వాత కూడా మహిళలు నగరాన్ని పాలించారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చటంలో ఆ మహిళా మేయర్ల పాత్రను.. అభివృద్ధి చేయటంలో వారి మార్కును చూపించి శభాష్ అనిపించారు. ఈసారి కూడా జీహెచ్‌ఎంసీ పీఠాన్ని మహిళ అధిష్ఠించిన సందర్భంగా... వారి సేవలను గుర్తుచేసుకుందాం.
మొదటిసారిగా మేయర్‌గా మహిళ...
హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మొదటి మహిళా మేయర్‌గా రాణీ కుముదిని దేవి ఎన్నికయ్యారు. రాణీ కుముదిని దేవి 1911 జనవరి 23న వరంగల్ జిల్లాలోని వాడేపల్లిలో హైదరాబాద్ రాష్ట్ర మాజీ ఉప ప్రధాని పింగిల్ వేనక్తరమణ రెడ్డికి జన్మించారు. వనపర్తి రాజకుటుంబానికి చెందిన రాణీ కుముదిని దేవి... మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ (ఎంసీహెచ్)లో ఆరోగ్య కమిటీ ఛైర్మన్‌గా సేవలందించారు. 1962లో మొదటి మహిళా మేయర్‌గా రాణీ కుముదిని దేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1962 నుంచి 1964 మేయర్‌గా సేవలందించారు.
1962లో హైదరాబాద్‌ను ముంచెత్తిన వరదల సమయంలో రాణీ కుముదిని దేవి సేవలు ప్రశంసనీయం. భవిష్యత్‌లో వరదలు రాకుండా ఆమె చేసిన అభివృద్ధికి నిదర్శనమే... ఇప్పుడున్న రహదారి వ్యవస్థ, పార్కులు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ భవనం ఉన్న భూమి ఆమె చేసిన ప్రయత్నానికి తార్కాణం. అనంతరం 1972 వరకు శాసనసభలో వనపర్తి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.
రెండోసారి మహిళా మేయర్...
రాణీ కుముదిని దేవి తర్వాత... వెనువెంటనే నగరానికి మరో మహిళా మేయర్‌గా సరోజిని పుల్లారెడ్డి ఎన్నికయ్యారు. సరోజిని పుల్లా రెడ్డి 1965లో కాంగ్రెస్ నుంచి ఎంసీహెచ్ కౌన్సిలర్‌గా ఎన్నిక కాగా... నగర మేయర్ పీఠాన్ని అధిష్ఠించారు. 1965 నుంచి 1969 వరకు మేయర్‌గా సేవలందించారు. అనంతరం... 1975 లో హైదరాబాద్ పట్టణ అభివృద్ధి అథారిటీకి మొదటి ఛైర్‌పర్సన్‌గా ఎంపికయ్యారు.
అనంతరం 1967లో మలక్‌పేట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. రెండుసార్లు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన తర్వాత... 1978 ఎన్నికల్లో ఓడిపోయారు. మొదటి మహిళా ప్రధాని ఇందిరా గాంధీతో సత్సంబంధాలు ఉన్న సరోజిని... 2001లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యురాలిగా పనిచేశారు.
జీహెచ్‌ఎంసీ మొదటి మేయర్‌గా...
జీహెచ్‌ఎంసీ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఓ మహిళ అభ్యర్థి మేయర్ పీఠాన్ని అధిష్ఠించారు. 2007లో జీహెచ్‌ఎంసీ ఏర్పడిన తర్వాత... మొదటగా 2009లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బండ కార్తిక రెడ్డిని మేయర్ పదవి వరించింది. మరే ఇతర అభ్యర్థి పేరును ఏ పార్టీ ప్రతిపాదించనందున తార్నాక నుంచి మొదటిసారి కార్పొరేటర్ పోటీ లేకుండా ఎన్నికయ్యారు. 2010లో ఆల్ ఇండియా మేయర్స్ కౌన్సిల్ వైస్ ఛైర్‌పర్సన్‌గా సేవలందించారు.
తొలిసారి ఇద్దరు మహిళకు పీఠం...
ప్రస్తుతం కొలువుదీరిన పాలకవర్గంలో ఓ రికార్డు చోటుచేసుకుంది. చాలా కాలం తర్వాత నగర మేయర్ పీఠాన్ని అధిష్ఠించే అవకాశం మహిళకు రాగా... తొలిసారిగా మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు మహిళలను వరించాయి. బంజారాహిల్స్ తెరాస కార్పొరేటర్‌గా... సీనియర్ నేత కె. కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి విజయం సాధించగా... మేయర్‌గా ఎన్నికయ్యారు. తార్నాక కార్పొరేటర్‌గా విజయం సాధించిన మోతె శ్రీలత ఉపమేయర్‌గా ఎన్నికయ్యారు.
గతంలో మహిళామణుల సారథ్యంలో హైదరాబాద్ అభివృద్ధి పథంలో నడవగా... ప్రస్తుతం మరోసారి ఆ అవకాశం దక్కించుకున్నారు. ఇప్పుడు కూడా ఇద్దరు వీరవనితలు... నగరాన్ని ప్రగతి మార్గంలో నడిపించి వారి మార్కు చూపించాలని కోరుకుందాం.