తెలంగాణ మహిళా భద్రత విభాగం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. సాంకేతికతతో మహిళలకు మరింత మెరుగైన సేవలందించాలని నిర్ణయించింది. తాము చేసిన ఫిర్యాదుల ఆధారంగా నమోదయ్యే కేసుల దర్యాప్తు ఎలా సాగుతోందో ఇంటి నుంచే తెలుసుకునే వీలు కల్పించేందుకు రంగం వాట్సప్ సామాజిక మాధ్యమాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించింది.
ఇప్పటివరకు బాధిత మహిళలు నేరుగా ఠాణాలను ఆశ్రయించడంతోపాటు షీ బృందాలకు సమాచారం అందించడం ద్వారా ఫిర్యాదులు చేస్తున్నారు. మరికొందరు వాట్సప్, ట్విటర్, ఫేస్‌బుక్.. తదితర సామాజిక మాధ్యమాలను వినియోగించుకుంటున్నారు. ఈ ప్రక్రియ ఫిర్యాదుల వరకు మాత్రమే సాధ్యమవుతోంది. కేసు స్థితిగతుల గురించి తెలుసుకోవాలంటే ఆయా ఠాణాలకు వెళ్లడమో లేదంటే ఫోన్‌లో ఆరా తీయడమో జరుగుతోంది. ఇకపై వాట్సప్ వీడియోకాలింగ్ విధానం ద్వారా దర్యాప్తు బృందాలు బాధిత మహిళలతో మాట్లాడి వివరాలు సేకరించనున్నాయి. ఆయా కేసుల్లో పరిణామాల గురించి మహిళలకు వాట్సప్‌లోనే సమాచారం అందించనున్నాయి.
అధికారుల తీరుపై ఫీడ్‌బ్యాక్
బాధిత మహిళలతో దర్యాప్తు అధికారులు వ్యవహరించే తీరుపై ఫీడ్‌బ్యాక్ సైతం తీసుకోవాలనే ఉద్దేశంతో మహిళభద్రత విభాగం ఉన్నతాధికారులున్నారు. అవసరమైతే తప్ప బాధితురాళ్లను ఠాణాకు పిలవకూడదనే ఉద్దేశంతో ఈ కార్యాచరణ రూపొందిస్తున్నారు. దీనికితోడు కొన్ని సందర్భాల్లో నిందితులతోనూ వాట్సప్ వీడియోకాలింగ్‌లో మాట్లాడి దర్యాప్తునకు అవసరమయ్యే సమాచారం రాబట్టనున్నారు. ఈ విధానం పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే బాధిత మహిళలకు మరింత ఉపయుక్తంగా ఉంటుందని తెలంగాణ మహిళా భద్రత విభాగం అదనపు డీజీ స్వాతిలక్రా తెలిపారు. కొత్త సంవత్సరంలో వీలైనంత తొందరగా ఈ విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.
ఇవీచూడండి: తెలంగాణ పోలీసులకు హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశంసలు